మారిషస్‌లో తెలుగు తేజం/ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు

వికీసోర్స్ నుండి
ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలలో జరిగిన నిర్ణయం ప్రకారం 1978వ సంవత్సరం తెలుగు ఉగాది నుంచి ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరగవలసి వుంది.

కాని దురదృష్టవశాత్తు 1977 నవంబర్ 19న ఉప్పెన-తుపాను ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని తాకి వేలాదిమంది మరణించారు. కోట్లాది ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘోర విపత్తు దృష్ట్యా మహాసభలను ఒక యేడాదిపాటు వాయిదావేసి 1979 ఏప్రిల్‌లో జరపాలని నిశ్చయించారు.

ఈ లోపుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. శ్రీ జలగం వెంగళరావుగారు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం. డా మర్రి చెనారెడ్డిగారు ముఖ్యమంత్రిగా నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది.

ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ పట్ల డా. చెన్నారెడ్డి ఆసక్తి ప్రదర్శించలేదు. మలేషియా ఆంధ్ర సంఘం అధ్యక్తులు డా. సి. అప్పారావు హైదరాబాద్ వచ్చి చర్చలు జరిపారు. 1979 జూలై తరువాత జరుపమని ప్రభుత్వం అంతర్జాతీయ తెలుగు సంస్థ ద్వారా మలేషియా ఆంధ్ర సంఘానికి సూచించింది.

మలేషియా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 1980 ఏప్రియల్‌లో జరుపడానికి మలేషియూ ఆంధ్ర సంఘం ముందుకు వచ్చింది.

ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల పట్ల ప్రభుత్వం అనాసక్తి ప్రదర్శించటం పట్ల ఆవేదన చెందిన కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ ప్రముఖులు, న్యాయమూర్తులు హైదరాబాద్‌లో సమావేశమై డా‖ బెజవాడ గోపాలరెడ్డిగారు అధ్యక్షులుగా, శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు కార్యనిర్వాహక అధ్యక్షులుగా మలేషియా తెలుగు మహాసభలకు తోడ్పడడానికి ఒక భారతీయ సంఘం ఏర్పర్చి తెలుగు మహాసభలకు ప్రజల మద్దతు సాధించేందుకు నడుం కట్టారు.  ఈ లోపుగా డా॥ మర్రి చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిపదవి నుండి వైదొలగడం, శ్రీ టంగుటూరి అంజయ్యగారు ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించటం జరిగింది.

శ్రీ బాట్టం శ్రీరామమూర్తిగారు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అయ్యారు. శ్రీ అంజయ్యగారు మలేషియాలో తెలుగు మహాసభల నిర్వహణకు సుముఖత చూపి ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారిని అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమించి మహాసభల నిర్వహణకు పూనుకున్నారు.

మలేషియా మహాసభలలో పాల్గొనాలని ఆంధ్ర ప్రజలు అత్యుత్సాహం చూపడం. విమాన ప్రయాణ ఏర్పాట్లలో రసాభాస జరిగినప్పటికీ మొత్తానికి ద్వితీయ ప్రపంచ తెలుగుమహాసభలు బాలారిష్టాలను అధిగమించి ద్వితీయ విఘ్నాన్ని చూడకుండా 1981 ఏప్రిల్‌లో కౌలాలంపూర్‌లో విజయవంతంగా జరిగాయి. అంతర్జాతీయ తెలుగు సంస్థ, మలేషియా ఆంధ్ర సంఘం సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో యీ సభల నిర్వహణ భారం మోశాయి.