భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/శివశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

శివశతకము వ్రాసినకవినామము తెలుపుపద్యములు మేము ప్రత్యంతరము వ్రాసికొన్న మాతృకలో లేవు. మాకుఁ జిక్కిన ప్రతి యొక్కటియే యగుటవలనను నూటయెనిమిది పద్యములకు నందింకఁ కొన్ని కొఱుఁతపడియుండుటవలనను ప్రత్యంతరసహాయము లేకుంటవలనను రచయితను నిర్ణయింప వీలులేకపోయినది. శతకకర్త పద్యములలోనివిషయములనుబట్టి చూడ వీరశైవుఁడని తోఁచుచున్నది. చెన్నబసవఁడు, బసవేశ్వరుఁడు, శివనాగుమయ్య, నిమ్మవ్వ, ధూర్జటి, ఉద్భటారాధ్యుఁడు లోనగువీరశైవుల నీకవిస్తుతించుట యీయూహకుఁ దార్కాణముగా నున్నది. కవి వీరశైవుఁడని నిరూపింప వీలుచిక్కినది. కవికాలమును గుఱించి ప్రయత్నింప నొకస్వల్పావకాశ మీశతకమునఁ గలదు.

ఈశతకమున రచయిత వీరశైవులగు శివభక్తుల ప్రభావముల నెన్నుచు ఆంధ్రకవులలో నగ్రేసరుఁడగు ధూర్జటికవి నిటులఁ బ్రశంసించినాఁడు.

క.

చెలిచంటిమీఁదఁ జేయిడి
చెలువొప్ప శివా యటన్న చేడియ నవ్వన్
చలపట్టి శివుని జూపిన
చెలువుని ధూర్జటిని దలఁతుఁ జెన్నొంద శివా.

76

ఈపద్యములోనికథ ధూర్జటికవి కారోపించి చెప్పువాడుక కలదు. కావున నిందుచేఁ బ్రకృతశతకకర్త పదునాఱవశతాబ్ది కీవలె నున్నాడని స్పష్టమగును.

ఈశతకములోని 4-5 పద్యము లించుక మార్పుగ కృష్ణశతకమునందును 10-వ పద్యము కొంచెము మార్పుగా భాగవతమునందును గలదు. మిగిలినపద్యములలో 7-వ పద్యము తెలుఁగుసమస్య లనుచిన్నిపొత్తములోఁ గలదు. తెలుఁగుసమస్య లనుపొత్తములోనిపద్య మిది.

క.

కందర్పహరుఁడు నరుతోఁ
బందికినై పారిపోరి పరిపూర్ణకృపన్
గ్రిందైన హరుని జూటపుఁ
జందురులో నిఱ్ఱి నేల చంగలిమేసెన్.

యోచింప సమస్యపద్యమునే శతకకర్త సంగ్రహించినటులఁ దోఁచును. ఇంతకు మిగిలిన పద్యములు స్వతంత్రము లనియే యూహింపవచ్చును.

శతకములందలి పద్యములు శివలీలలు శైవులభావములు తెలుపుచున్నవి. పద్యములు భావములతో నిండి మంచినడకతో నలరారుచున్నవి. ఇందు లక్షణలోపములు మాత్రము తఱచుగాఁ గానవచ్చుచున్నవి. ఇత్వ అత్వములకుఁ బ్రాయికముగ యతి గూర్పఁబడియున్నది. గణనియమముగూడఁ బాటింపనితావులు కొన్ని గలవు. జీర్ణమై ఖిలముగానున్న యీయముద్రితశైవశతకమును ముద్రణమునకుఁ బ్రత్యంతరము వ్రాసికొన నవకాశము కల్పించి గ్రంథప్రచురణమునకుఁ దోడ్పడిన కో. వీరబసవయ్యగారు ప్రశంసాపాత్రులు.

ఈశతకమునందలి వీరశైవులలీలాదికములు అన్యవాదకోలాహలములోనిపద్యము ననుకరించుచున్నవి. భక్త్యతిశయముచే ఛందోనిబంధనలు పాటింపక కవిత చెప్పుటచేఁ గవి యిందుదోషములను గమ నించియుండఁడేమో! ప్రత్యంతరము చిక్కువఱ కుపేక్షించినచో నీశతకము నశించునేమో యని యథాశక్తి సవరించి ప్రచురించితిమి.


నందిగామ.

ఇట్లు భాషాసేవకులు

1-1-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.

శ్రీరస్తు

శివశతకము

క.

శ్రీశాంకరీమనోహర
పాశాంకుశ ఖడ్గపాణి ప్రమథాధిప కీ
నాశస్తుత దురితౌఘవి
నాశాంకుశ కోర్కులిమ్ము నమ్మితిని శివా.

1


క.

వేదములు నాల్గుహయములు
నాదరముగ చర్నకోల నగణితప్రణవం
బావేదసారథౌటకుఁ
జేవెవరికి నీకుఁదక్క జగదీశ శివా.

2


క.

వలనొప్ప సూర్యచంద్రులు
నలరథచక్రములు విష్ణువంబుగ, జ్యాయై
వెలయఁగను నాదిశేషుఁడు
వెలువడునే మేరువిల్లు వినుతింతు శివా.

3


క.

నీవే తల్లివి దండ్రివి
నీవే నాతోడునీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నే నన్యు నెఱుఁగ నిజ మిదియు శివా.

4

క.

ఓకారుణ్యపయోనిధి
నా కాధారంబ వగుము నమ్మితి నెపుడున్
నా కేల యితరచింతలు
నాకాధిప సర్వలోకనాయకుఁడ శివా.

5


క.

అండజవాహన వినుతా
ఖండలముఖపూజితాంఘ్రి కంజాతయుగా
చండాంశుకోటితేజా
భండనరిపుమదవిభంగ భస్మాంగశివా.

6


క.

కందర్పహరుఁడు నరుతోఁ
బందికినై పోరిపోరి పరిపూర్ణకృపం
క్రిందైన నీదుబూటక
మెందైనంగలదె నిన్ను నేమందు శివా.

7


క.

పవనము వశగతి జేసియు
వివశత్వమువిడచి యాత్మవిజ్ఞానముచే
వివరించి చూపులోపల
శివకళ యెఱుఁగంగవచ్చుఁ జిన్మయుఁడ శివా.

8


క.

నాగేంద్రచర్మచేలా
నాగాభరణాంచితోగ్ర నవ్యశరీరా
నాగారివాహజనకా
నాగారీవాహవినుత నమ్మితిని శివా.

9


క.

నీపాదకమలసేవయు
నీపాదసరోజభక్తి నిరతులయెడల

న్నేపార నిష్టజనదయ
నే పావనమౌదు నన్ను నెనగూర్చు శివా.

10


క.

బ్రహ్మతల గొట్టినాఁడవు
బ్రహ్మాండములోన నీకుఁ బ్రతి యెవ్వ రికం
బ్రహ్మేంద్రామరవందిత
బ్రహ్మానందం బొసంగి బ్రతికించు శివా.

11


క.

త్రివిధప్రసాదమహిమము
పవిధరునకు వశమె పొగడ భర్గునిగృపచే
భవదూరు లైనవారికి
శివయోగులమహిమలన్ని సిద్ధించు శివా.

12


క.

మూలము లేదు శరీరికి
మూలము గలదంచు లోకమూలముచేతన్
మూలంబగు పంచాక్షరి
మూలము గుర్తెఱుఁగువాఁడె ముక్తుండు శివా.

13


క.

మార్కండేయునికొఱకై
మార్కొని లయకాలయముని మడియఁగఁ దన్నం
బేర్కొని సురలు నుతింపఁగఁ
గోర్కులు సమకూర్చినట్టి గుణమణివి శివా.

14


క.

కమలములు వేయిలోపలఁ
గమలమునొకటియును లేక గమలాక్షుండుం
గమలమని నేత్రకమలము
గమలక నర్చించె మిమ్ము గణుతింతు శివా.

15

క.

హాలాహల మది యెంతో
హేలాగతి బెచ్చు పెరిగి యెక్కడఁ దానై
కోలాహలంబు చేయఁగ
నేలాగున మ్రింగవచ్చు నితరులకు శివా.

16


క.

మదనారిబేసిపురములు
గదనంబునఁ ద్రుంపలేక కమలజముఖ్యుల్
అదనెఱిఁగి మిమ్ము వేఁడిన
విదితంబుగ నొక్కకోల వేసితివి శివా.

17


క.

కాముఁడు దనపోడిమితో
గామింపఁగఁ జేయఁదలఁచి కామశరాళిన్
హేమించి వేసె నీపై
సామాన్యమె నిన్ను గెల్వఁజాలుటకు శివా.

18


క.

ఇందీవరహితజూటా
బృందారక మౌనిబృందపూజితచరణా
కందర్పకోటిరూపా
సుందరభసితాంగవేష సుశ్లోక శివా.

19


క.

అంగన కర్ధశరీరము
నంగీకారముగ నొసఁగి యానందముతో
బొంగుచునుండెడి వేల్పులు
రంగుగ నెవరైనఁ గలరె రహిమీఱ శివా.

20


క.

ఒకసారి నీదు నామము
వికటీకృతశ్వేతుఁడేమొ వివరించుటచేఁ

బ్రకటించు పాపసంఘము
నకటా హరియింపఁబడియె నదియేమొ శివా.

21


క.

ఎంబన్న సేయుహాస్యము
నంబికి గుంటెనయు నడచునడవడి నీకున్
అంబలిపై భ్రమపుట్టుట
పంబినవేడుకయు నిదియుఁ బరమాత్మ శివా.

22


క.

చెల్లుబడి యెంత గలిగిన
భళ్లాణుని సతిని గోరఁ బాడియె నీకున్
చెల్లరె చెల్లని దిదియును
సల్లలితులజాడగాదు సర్వజ్ఞ శివా.

23


క.

పువ్వులు ఱువ్విన మదనుని
జివ్వున భస్మంబు చేతురే తగవగునే
నవ్వుచు సాంఖ్యము ఱాళ్లన్
ఱువ్విన మోక్షం బొసఁగ విరుద్ధంబు శివా.

24


క.

పులి యేమి చేసె పుణ్యము
సలలితముగ సామజంబు సౌఖ్యంబేమో
పలుపాముపలుకుఁ దోడా
చెలు వలరఁగ మోక్ష మెట్లు సిద్ధించు శివా.

25


క.

తిన్నఁడు దిన్నఁగ నీకున్
ఎన్నికతోఁ బెట్టినట్టి యెంగిలి పొలసుల్
పన్నగభూషణ రుచియే
మన్ననతో నేలినావు మమ్మేలు శివా.

26

క.

పిట్టవ్వ బెట్టుపిట్టకుఁ
గట్టడి చేసికొని నీవు గావేరి వెసం
గట్టిగఁ గట్టితి వందురు
కట్టడివిగదన్న నన్నుఁ గరుణించు శివా.

27


క.

చిఱుతొండభక్తునింటను
బరువడి శిశుమాంస మడిగి భక్షించిననీ
మరుగెల్లఁ దెలిసివచ్చెను
నెఱుఁగుదు నీగుట్టు లేలు మిఁక నన్ను శివా.

28


క.

మోకాలు మేఁకపెంటిక
శ్రీకోమలికుచము నీకు శ్రేష్ఠంబయ్యెన్
లోకాధినాథ నీదగు
నాకారము జూపు నాకు నదియేమొ శివా.

29


క.

కొంకక దుర్మదవృత్తిని
సంకల్పించితిని బాపసంచయమెంతో
వంకలు నెన్నఁగఁ దగదిఁకఁ
బంకజభవవినుత నన్నుఁ బనిగొమ్ము శివా.

30


క.

వెలిబెట్టె నొక్కభక్తుఁడు
బలుమఱు రోఁకంటిబాధ బాల్పడె నొకఁడున్
బలుబాధ లేల నీకున్
జెలువుగ న న్నేలరాదె శీఘ్రముగ శివా.

31


క.

తటవట లేటికి జేసెదు
కటకట మహదేవ కోటకాటనిఘనునిన్

ఎటువలె మును రక్షించితొ
యటువలె న న్నేలరాదె యవ్యక్తశివా.

32


క.

పటుతరపాపము లన్నియు
నెటువలె భరియించువాఁడ నేమెఱుఁగ నయో
కుటిలుఁడను ఘోరకోపుఁడ
గటికితనం బేల నన్నుఁ గరుణించు శివా.

33


క.

సంసారసంగ మంతయు
హింసాధికమంచు మదిని నెంచియు నే నీ
సంసారభ్రాంతి నుండితి
హంసాస్పద బ్రోవవయ్య యాశ్రితుఁడ శివా.

34


క.

ఒల్లరె యిహసుఖచింతల
నొల్లరు పరదారధనము లొల్లరు సతులన్
ఒల్లరు పరనిందాస్తుతి
నొల్లరు నీభక్తిపరులు నుమనాథ శివా.

35


క.

చేసితి పరదైవస్తుతి
జేసితి బరసతులపొందుఁ జేసితి హింసల్
జేసితిని నోపినంతయుఁ
జేసినతప్పెల్లఁ గావు చిన్మూర్తి శివా.

36


క.

నీకంటె నధికుఁ డెవ్వఁడు
నాకంటెను మూర్ఖుఁ డెవఁడు నగచాపధరా
నీకుంటినవారలలోఁ
జేకొంటిని నన్నుఁ గల్పు చిద్రూప శివా.

37

క.

ఏనుఁగు నిచ్చినయప్పుడె
మానుగ నంకుశము దాఁప మర్యాదగునే
ఏనొంటి నుండఁజాలను
లోనౌదును నీదుభక్తలోకులకు శివా.

38


క.

పామరము విడువఁజేసియు
వేమఱు నీభక్తకోటివిమలపదంబుల్
నీమమున నాదుతలపై
బ్రేమను భరియింప బుద్ధిఁ బుట్టించు శివా.

39


క.

కుల మొల్లరు స్థల మొల్లరు
కలుషము విడనాడి భక్తిఁ గైకొందు రిలన్
ఫల మొల్లరు బల మొల్లరు
కలుతురు నీలోన మనసు గలిసియును శివా.

40


క.

లోకేశ భక్తవత్సల
చేకొను నాతప్పులెల్ల శర్వాణిధవా
కాగోదరకరకంకణ
నీకోమలరూపుఁ జూపు నిక్కముగ శివా.

41


క.

ఖండేందుమౌళి కావుము
కుండలకోటీరహార కోమలదేహా
ఖండలవందిత శ్రీవర
కాండా న న్నేలకుండఁ గాదింక శివా.

42


క.

పరమేశ పార్వతీపతి
వరద త్రియంబక మహేశ వాగీశనుతా

శరదభ్రశుభ్రదేహా
శరజన్మునిజనక కావు సత్వరము శివా.

43


క.

వేదంబులు గననేరక
వేదనతోఁ బెక్కుగతుల వివరింపంగా
భేదించి నీదుతత్త్వము
ఆదిపరబ్రహ్మ పొగడ నలవగునె శివా.

44


క.

శ్రీధవ వేధలకైనను
నాధీనముగాదు నీదునాద్యంతంబున్
భేదించి యిట్టిదన నుమ
నాథా నేనెంతవాఁడ న న్నేలు శివా.

45


క.

కైలాసశైలమందిర
శైలాత్మజనాథ మౌనిసేవితచరణా
శైలారివంద్య కాంచన
శైలధనుఃపాణి నిన్ను స్మరియింతు శివా.

46


క.

గోరాజవాహపూజిత
గోరాజవిరాజమానగుణరత్ననిధీ
హేరాజరాజరాజిత
హారాకోటీర శంబరాంతకుఁడ శివా.

47


క.

హాలాహలలాంఛనగళ
హేలాధవదహననేత్ర యిందుకిరీటా
కోలాహలాంతకాంతక
లీలావీరావతార లీనాత్మ శివా.

48

క.

శితికంఠ శూలపాణీ
ప్రతి లేరిఁక నీదుసాటి పద్మభవాదుల్
అతిదీనుఁడ న న్నేలుము
సతతము నీ పాదసేవ సమకూర్చు శివా.

49


క.

ఫాలాక్షు పాపనాశన
చాలా వేఁడితిని నింకఁ జలపాదితనం
బేలా నీపదభక్తుని
కేలా యిహకష్టసుఖము లీశాన శివా.

50


క.

అక్షయ గురుపాపక్షయ
దక్షాధ్వరనాశ దావదవశిఖినేత్రా
యక్షేశమిత్ర మైత్రిని
రక్షింపఁగదయ్య అయ్య రహిమీఱ శివా.

51


క.

నిక్షేపము నాపాలిటి
యక్షేశసఖుండు పార్వతీశుం డనుచున్
ఆక్షేపించక కొల్చెద
నీక్షణమే నన్ను బ్రోవు మీశాన శివా.

52


క.

శంకర పాపభయంకర
కంకాళకపాలహస్త గౌరీరమణా
ఓంకారమంత్రమయహర
హంకారవిదూర మోక్ష మబ్బించు శివా.

53


క.

భవదూర భర్గ భయహర
పవనాశన యీశ భక్తపాలన శర్వా

భువనైకపోష పశుపతి
పవిధరవందిత మహేశ ఫాలాక్ష శివా.

54


క.

కృషిఁ జేసితి బహుకాలము
వృషభధ్వజ మిమ్ముఁగూర్చి వేమాఱు మదిన్
మృషగాదు నన్ను నేలుము
విషధర ఫణిరాజభూష వినుతింతు శివా.

55


క.

విశ్వేశ విశ్వరూపక
విశ్వాత్మక వేదవేద్య వేదాంతమయా
విశ్వంబులోనివారలు
శాశ్వతముగ మిమ్ము గొల్వఁజాలుదురె శివా.

56


క.

శివనామము శుభమిచ్చును
శివనామము జనులకెల్ల చెలువము తెచ్చున్
శివనామ మొసఁగు నాయువు
శివనామము మోక్ష మొసఁగు సిరు లిచ్చు శివా.

57


క.

సూనశరాసనవైరీ
మానుగ నీపాదభక్తమండలి యిండ్లన్
బూనుకొని నిలువఁజేయుము
జానుగ నాజన్మఫలము సఫలంబు శివా.

58


క.

ముదమున నీపదభక్తుల
-సదమలపదసరసిజముల సతతము దూరే
మదనారి నాదుశిరమునఁ
గదసిన పావనముగాదె కామించి శివా.

59

క.

ఎన్నెన్నిజన్మములకున్
బన్నగధర నీదుభక్తిపరిపూర్ణునకున్
జెన్నొంద సేవ జేయఁగఁ
గన్నకుమారునిగ నన్నుఁ గరుణించు శివా.

60


క.

నీకంటే నెవ్వరింకను
నాకంటికి నితరచింత నగపడదుగదా
నీకంటకంబు మానియు
శ్రీకంఠా నన్ను నేలు శీఘ్రముగ శివా.

61


క.

పంచముఖ నిన్ను నమ్మితి
వంచనచేయక మహేశ వరద పినాకీ
అంచితముగ సాయుజ్యము
సంచితముగ నాకు నొసఁగు సర్వేశ శివా.

62


క.

దారువనమునులభామల
ధీరుఁడవై కూడి యితరదేవుళ్లకునున్
మేరువవై వరమిచ్చిన
పారుఁడ ని న్నెన్న వశమ పరమేశ శివా.

63


క.

గొడగూచి పాలు ద్రావఁగఁ
గడుపున క్షుధ దీఱలేదొ కడుమోహంబో
తడబడక విసము మ్రింగిన
బడుగవు ని న్నేమనందు పరమేశ శివా.

64


క.

సత్తెక్కయింటి కేగియు
నత్తను పలుమాటలాడి యావిడచేతన్

మొత్తఁబడితి విం కేమనఁ
గుత్తుక విషమున్నవాని గొట్టుదురు శివా.

65


క.

మాయ న్మాయలఁ బెట్టిన
మాయకుఁడవు నీవు గాని మదినమ్మితి నే
మాయలవాఁడను గా నిఁక
మాయింపుము నాదుదురితమార్గములు శివా.

66


క.

కంబళినంచును నొకరికిఁ
గంబళి గప్పుకొనివచ్చి కై లాసంబున్
శంబరవైరికి వైరీ
సంబరమున నిచ్చినట్టి సర్వజ్ఞ శివా.

67


క.

హరుఁడే దైవ మటంచును
నిరవొందఁగ సభలయందు నెగ్గించినయా
వరగురుని మల్లికార్జును
వరదుని నామదిని నెపుడు వర్ణింతు శివా.

68


క.

లక్షాతొంబదియాఱును
నక్షయగణములను గూడి యాబిజ్జలునిన్
శిక్షించి భ క్తిజూపు స
లక్షణ బసవన్నఁ గొల్తు లక్షించి శివా.

69


క.

ఫాలాక్షభక్తవితతియు
నేలాగున గోరువారు నీలాగుననే
మేలయినచీరె లిచ్చెడి
శీలున్ మడివాలుఁ దలఁతుఁ జిత్తమున శివా.

70

క.

అచ్చొత్తినగొఱ్ఱెకునై
విచ్చలవిడి ద్రోహిఁ జంప విపులేశుసభన్
విచ్చేసి శివునిసాక్షిగ
మెచ్చిచ్చినకిన్నరునకు మ్రొక్కుదును శివా.

71


క.

బసవండిచ్చినయాసతి
పసగలభక్తుండు చెన్నబసవనితలపై
వెసనిడుకొని చెల్లించెడి
యసమానుని మదిఁదలంతు నఖిలేశ శివా.

72


క.

వేదంబులు శునకముచే
వాదంబున జదువజేసి వప్పించినయా
భేదుండగు కక్కయ్యను
భేదం బెడబాసి గొల్తు బెంపొంద శివా.

73


క.

కులహీనుఁ డీతఁ డన్నను
గులజులు చూడంగ వ్రేళ్లుకోసినసాలున్
అలిగురిసినట్టిపుణ్యుని
సలలితు శివనాగుమయ్య స్మరియింతు శివా.

74


క.

కంచేడువాడవారలఁ
గొంచక కైలాసమునకుఁ గొంపోయిన ని
ర్వంచక నిమ్మవ్వను నే
వంచన లేకయె నుతింతు పరమాత్మ శివా.

75


క.

చెలిచంటిమీఁదఁ జేయిడి
చెలువొప్ప శివా యటన్నఁ జేడియ నవ్వన్

జలపట్టి శివుని జూపిన
చెలువుని ధూర్జటిని దలఁతు చెన్నొంద శివా.

76


క.

శ్రీచందనంబు కావడి
నేచందమునైన దెచ్చి యిదిగో ధూపం
బోచంద్రజూట కొనుమను
నీచందపుయోహియుణ్ణి నేగొల్తు శివా.

77


క.

వటవృక్షభూతములకుం
బటుతరకైలాస మిచ్చి పరగినపుణ్యుం
డట నుద్భటార్యగురునిన్
ఘటికుని నామదిని దలంచి గణుతింతు శివా.

78


క.

ఘటనాఘటనసమర్థులు
కుటిలురసద్భావపరులు కొందఱు ప్రమథుల్
పటుతరముగ లెక్కింపను
నెటు లోపును శేషుఁడైన నీశాన శివా.

79


క.

తోఁచినమట్టుకు వర్ణన
నేచేసితి నన్నమాట నేర్పడదుగదా
యోచించు బ్రహ్మయైనన్
వాచకుఁ డెవఁడింక నిన్ను వర్ణింతు శివా.

80


క.

భసితము పాపవినాశని
భసితము పరమార్థదాయి ఫాలాక్షుకృపన్

భసితము బెట్టిన మనుజుఁడు
శశిమౌళీ శ్రేష్ఠుఁ డతఁడు చర్చింప శివా.

81


క.

భూతిధరించినపుణ్యుఁడు
పాతక మెడబాసి హరునిపజ్జనె యుండున్
భూతి యైశ్వర్యకరమగు
భూతేశునకైనదరమె భూ తెన్న శివా.

82


క.

పరమేష్ఠిఫాలమందున
నరునకుఁ జెడువ్రాత వ్రాయ నవి దుడిచియుఁ దాఁ
బరగ శుభ మిచ్చు భసితము
నరుదార మహాత్ము నెన్న నలవగునె శివా.

83


క.

భూతివలన భూతంబులు
భేతాళులు భీతిఁ జెంద భీకరగతులన్
భూతేశునిప్రియ మగుటం
బాతకహతి భూతి పరమపావనము శివా.

84


క.

రుద్రాక్షమహిమ దెల్పఁగ
రుద్రునిచే నగునొ కాదొ రూఢిగ నరులున్
భద్రముగఁ దాల్పవలయున్
రుద్రా రుద్రా యటంచు రుద్రాక్ష శివా.

85


క.

ఏకముఖి మొదలుగాఁగల
లోకములో ముఖము లుండు రుద్రాక్షలకున్

బాకారి బ్రహ్మ హరిముఖు
లేకాకృతి వాని దాల్తు రెల్లపుడు శివా.

86


క.

రుద్రాక్షు నరుఁడు దాల్చియు
రుద్రునిలోకంబునందు రూఢిగ నుండున్
రుద్రమగు యమునిబాధలు
ఛిద్రముపై తొలఁగుఁగాక శీఘ్రముగ శివా.

87


క.

పంచాక్షరి భవహరమగుఁ
బంచాక్షరి మంత్రరాజపరిపూర్ణంబౌ
పంచాక్ష రిచ్చు మోక్షము
పంచాక్షరి పంచముఖుఁడు పరికింప శివా.

88


క.

వేదంబునట్టనడుమను
పాదించుచు శివునికంటె పరుఁ డున్నాఁడా
భేదింపలేఁడు పరమని
వాదించుచు నుండు నితరవర్ణములు శివా.

89


క.

ఐదక్షరములు గూడఁగ
పైదై ప్రణవంబు బల్కు పరశివుమహిమల్
ఏదైన దానిసరియే
వాదింతురె దీని కితరవాదకులు శివా.

90


క.

పరధనముల హరియించితిఁ
బరభామలభ్రాంతి పడితిఁ బరిపరిగతులన్

బరభక్తి కాసజెందితిఁ
బరమపరా నన్ను బ్రోవు పరమేశ శివా.

91


క.

ఉదరము పోషించుటకై
సదమలమతి నిన్ను గొల్వఁజాలక చాలా
విధములను నదిరిపడితిని
మదినుంచక నన్ను బ్రోవు మదనారి శివా.

92


క.

శివశంకర శివశంకర
శివశంకర యనుచు నెపుడు సేవింతు మదిన్
శివశంకర శివశంకర
శివశంకర బ్రోవుమయ్య శీఘ్రముగ శివా.

93


క.

సిరి యురమునఁ గలహరియును
బరమేష్ఠియు నీదుపాదపద్మములు తగన్
గుఱుతుఁ గనజాలరైరట
ఉరులింగ మహేశ భక్తయోగీశ శివా.

94


క.

వరసాయుజ్య మొసంగఁగ
మఱమఱి వేఁడితిని నన్ను మన్నించుము నే
దురితాత్ముఁడ దుర్జనుఁడను
గరుణామృతదృష్టి జూడు కఱకంఠ శివా.

95


క.

మురహరుఁడు నేత్రకమలము
మురియుచు నర్చింప నీవు ముచ్చట గాఁగన్

వరచక్ర మొసఁగి బ్రోవవె
శరణాగతరక్షకుఁడవు జగదీశ శివా.

96


క.

పరమాత్ముఁడవని గొలిచిన
సురపతి కైశ్వర్య మొసఁగి శుంభద్గతిచేఁ
గరుణించలేదె దీనుఁడ
దరిజేర్పుము నీలకంఠ దయయుంచి శివా.

97


క.

కరచరణాద్యవయవములు
గరము సలక్షణతనుండుకాలం బిదె నీ
స్మరణకుఁ బాత్రుని జేయవె
వరమార్కండేయుభాతి పరమేశ శివా.

98


క.

మరణాంతకసమయంబున
హరహర దలఁచెదనొ లేక యటుగాదో నా
కిర విప్పుడె చెప్పఁగదే
కరకంఠా నీదురూపు గాన్పించి శివా.

99


క.

ధరలో దాత లనేకులఁ
బురహర సృష్టించినావు భూతేశుఁడ నీ
సరి లేరటంచుఁ జాటెదఁ
బరమాత్మా జగమునందుఁ బ్రఖ్యాతి శివా.

100


క.

చిరతరభక్తిని గొల్వఁగఁ
బరమానందమును బొంది ప్రావీణ్యతచే
నరులకు భక్తియు ముక్తియుఁ
గరుణించేదొరవు నిన్నుఁ గనుగొందు శివా.

101

క.

సురసేవ్యుఁడ నీపదములు
కరవీరలఁ దుమ్మిమల్లికాకుసుమములన్
విరజాజిపూల కనకాం
బరపూవుల పూజ జేసి గణుతింతు శివా.

102


క.

పరుఁడని యెంచక నే ద
బ్బఱలాడఁగలేను నీదుపదయుగ్మము నా
శిరమునఁ జేర్పుము మొక్కెద
బరశివ నావిన్నపంబుఁ బాలించు శివా.

103


శివశతకము సంపూర్ణము.