పుట:Womeninthesmrtis026349mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతికాలపు స్త్రీలు

ప్రథమాధ్యాయము

స్త్రీ సంతతి

అన్నదమ్ములు కల కుమార్తెకును నన్నదమ్ములు లేని కుమార్తెకును ధర్మశాస్త్రములలో విశేషభేదము పాటింపబడినది. అన్నదమ్ములు కల కుమార్తెవలన కంటె నన్నదమ్ములులేని కుమార్తెవలన పితృవంశమున కెక్కుడు లాభము గల్గుచున్నది; కుమారుడే విధముగ వంశవర్ధకుడగు చున్నాడో యామెయు నా విధముననే వంశవివర్ధిని కాగలదు. కావుననే యామెకు "పుత్రిక" యని పేరు. అన్నదమ్ములు గల కుమార్తెకు "పుత్రిక" యను నామమెచ్చటను వాడబడలేదు. "సుత", "దుహిత" మున్నగు నామముల చేతనే యామె వ్యవహరింపబడును. ఏమన: పుత్రధర్మ మామెయందు లేదు. పుత్రశబ్ద నిర్వచనము మనుస్మృతిలో నీ క్రింది విధముగ చేయబడినది.

పున్నామ్నో నరకాద్యస్మాత్త్రాయతే పితరంసుతః
తస్మాత్పుత్ర ఇతిప్రోక్తః స్వయమేవ స్వయంభువా.
                                                (మను 9-135)
(తండ్రిని పున్నామ నరకమునుండి రక్షించుచున్నాడు.
కావున పుత్రున కాపేరు స్వయంభువుడు కల్పించినాడు)