పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

నోపాథ్యాయుడు సెక్రిటరీకి భయపడుచుండెను. శాస్త్రులవారికి ఎవడును లక్ష్యములేదు. ఒకదినము పేరిగాడు నిద్రపోవుచుండగా బెత్తముతో వాని వీపున, కాళ్ల మీద దెబ్బలు వాయించి వానికి కనబడక మరలవచ్చి తరగతిలో పాఠములు చెప్పసాగిరి. 'ఓయమ్మో, ఓయిబాబో,' అనివాడు అంగలార్చుచు 'నన్నెవరో కొట్టేశారండీ, చంపేశారండీ' అని రొద చేయసాగెను. ఉపాథ్యాయులందఱును వచ్చిరి. అందఱికిని వెనుక శాస్త్రులవారు పోయిరి. ఎవరు వానిని కొట్టినదియు తెలియ లేదు. బాలురు వినోదము చూచుచుండిరి. పేరిగానికి నాడు కాయశుద్ధియైనందులకు అందఱును సంతోషించిరి. శాస్త్రులవారు వానితో 'నువ్వుచేస్తూండేద్రోహానికి నిన్ను వెంకటరమణమూర్తి శిక్షించాడు. పో, ఎవరితోపోయిచెప్పుకొంటావో చెప్పుకోపో,' అని వానిని తఱిమివేసిరి. శాస్త్రులవారిని బదులు కొట్టుటకు వానికి ధైర్యములేదు, బలమునులేదు. వాడు వెంటనేపోయి సెక్రిటరీగారితో చెప్పుకొనెను. సెక్రిటరీ వీరిని తమయింటికివచ్చి అందులకు సమాధానము చెప్పవలసినదని ఆజ్ఞాపించెను. 'మేము ఇందుకోసం సెక్రిటరీగారి యింటికిరాము. ఈ విషయంలో మాయింటికి వారు రావచ్చును. లేదా స్కూలుకు వచ్చిమాట్లాడవచ్చును.' అని శాస్త్రులవారు బదులుపలికిరి. సెక్రిటరీ ఆయూరిలో పలుకుబడిగలవాడేయైనను తుదకు శాస్త్రులవారికి లొంగిపోయెను; పేరిగాడును స్కూలు నౌకరీ సరిగా చూడసాగెను.