పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3-ప్రకరణము

విద్యాభ్యాసము

ప్రతిభావంతులకు విద్య బంగారమునకు మెఱుగువంటిది. శాస్త్రులవారి విద్యయంతయు స్వయంకృషియే; తండ్రిగారికడ చదివినది చాలతక్కువ. అందుల కుదాహరణముగా నీయుదంతమును వారుచెప్పగా వింటిని. వేంకటరమణశాస్త్రులవారు, వీరిని వేంకటసుబ్బయ్యగారిని పిలిచి సంస్కృతము చెప్ప దలంచి హితోపదేశమును పాఠముచెప్ప నారంభించిరి. ఆటలపైనను వీథులు తిరిగి వేడుకలు చూచుటయందేగాని ఇంకను చదువులమీదికి శాస్త్రులవారిదృష్టి పోలేదు. తండ్రిగారు

శ్లో. అసాధనా విత్తహీనా బుద్ధిమన్త స్సుహృత్తమా:
   సాధయ న్త్యాశు కార్యాణి కాకకూర్మమృగాఖువత్.

అను శ్లోకమునకు చమత్కారముగా నీక్రింది విధమున నర్థము చెప్పనారంభించిరి.

"అసాధనా=సాధనములు లేనివారున్నూ, మీవలెనే, మీకు సాధనాలులేవు; విత్తహీనా:= డబ్బులేనివారున్నూ, అదిన్నీ మీవలెనే, మీకుడబ్బెక్కడిది, వట్టి దరిద్రులు, బుద్ధిమన్త:= బుద్ధిమంతులున్ను - (ఇది బహుశ: తమవలె నేమోయనితలంచి కొమాళ్లు కొంచెము మనసు తృప్తిచేసికొనిరి) ఇది మీవలె అనుకున్నారా ఎంతమాత్రంకాదు, మీకు తెలివెక్కడిది; సుహృత్తమా:= మంచిస్నేహితులున్నూ, ఇదిన్నీ మీవలెకాదు, మీకు స్నేహం బొత్తిగాలేదు, నిరంతరం కొట్టుకోవడమే మీపని" అని యీతీరున కొమారుల కిరువురకును పాఠముచెప్ప నారంభిం