పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

ఉపోద్ఘాతము

ఆంధ్ర వాఙ్మయమునకు పందొమ్మిదవ శతాబ్ద్యుత్తరార్ధమున నూతనవికాసము కలిగినది. అట్లే దేశమందంతటను, ఒక్క భాషకే అననేల, పెక్కింటికి నూతనోజ్జీవము కలుగజొచ్చినది. మదరాసు విశ్వవిద్యాలయ స్థాపనము, ఆంగ్లవిద్యాప్రాబల్యము, పత్రికాప్రచారము, పాశ్చాత్యనాగరికతాప్రాచుర్యము మున్నగు ననేకకారణములచే జనులరుచులు వేషభాషలు మాఱజొచ్చినవి. అంతకుముందు దేశమందులేనివి, వాఙ్మయమునకు జీవనౌషధములు, ముద్రాయంత్రములు వెలయజొచ్చినవి. దేశమంతయు మేలుకొనందొడంగినది. అట్టి యాసంధికాలమున పలువురు పండితులును, వర్తకులును, సంస్కృతాంధ్ర గ్రంథములను, కనబడినవానినెల్ల వీలున్న పరిష్కరించి, లేకున్న దొరకినది దొరకినట్లుగా ముద్రించి, అదేయదనుగ హెచ్చు వెలలకు విక్రయించుచుండిరి. కవులును కొందఱు ఆంగ్లవిద్యా సంపర్కముచే నూతనమార్గములలో కవనములకుం దొడంగి, తత్పూర్వము ఆంధ్రమున లేనివానిని, నాటకాదులను ఆంగ్ల గీర్వాణాదిభాషలనుండి యనువదించుచుండిరి.

ఇట్లు క్రొత్తయావేశముతో రచించు నీకవులు పెక్కు ప్రమాదములకు లోనగుచుండిరి. సంస్కృత గ్రంథముల ననువదించువారు మూలమును చక్కగా అనుసరింపకయు