పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నైనను ఏవిషయము నందైనను ప్రతివాదినెన్నడును గెలిచి పోనీయలేదు. వారితో నెదురువాదముసల్పి నెగ్గినవారు లేరు. ప్రతిపక్షులు ఎదురుదెబ్బకొట్టలేక డొంకతిరుగుడుగావచ్చి తాకవలసినదే. పండితులెల్ల నొక్కటిగ తమపాత్రోచితభాష నరికట్టుంబూనినప్పుడు అందఱనుఎదిర్చి కేవలము తమ వాగ్‌ఝురిచేతనే తమసిద్ధాంతమును నెలకొల్పినారు. గ్రామ్యమును విశ్వవిద్యాలయమునకు రానీయక అడ్డినారు. పెక్కువిషయములలో పరమసిద్ధాంతములను వచించియున్నారు. వా రేపద్ధతి ననుసరించినను అయ్యది శాస్త్రీయముగను, ఆదర్శప్రాయమగునట్టిదిగా నుండుటయేగాక లోకవ్యవహారమున నెఱవేరదగినదిగా నుండును. గ్రామ్యమునకుగాని వ్యావహారికమునకుగాని వాఙ్మయములో స్థానమున్నదని నిరూపించినారు గాని వాఙ్మయమంతయు వ్యావహారికమయ మగుటకు వారొప్పలేదు. ఆయావిషయములకు తగినశైలియు భాషయు నుండవలయునని వారి యాశయము. వారును, పాత్రోచితభాషయని చెప్పినను, ఒకవిధమున వ్యావహారికమును నాటకములలో వ్రాసియున్నారనియే చెప్పవలయును. రసగ్రహణపారీణులైనందున, పడవవాండ్రు, చాకళ్లు, మంగళ్లు, మొదలైనవారి పాటలును మాటలును రసవంతములై, ఏట్లెట్లు లోకమున నుచ్చరింపబడుచున్నవో ఆయావిధముననుండిన గాని స్వారస్యము లేదనితలంచిరి. అది గదాభావోద్రేకమునకు కారణము. వానినెల్లను గ్రంథస్థములంజేసి వానికి శాస్త్రీయమైన స్థానమును ఆంధ్రవాఙ్మయమున నొసంగుటకై