పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఋణముతీరినది. ఆతర్వాత ఆఱునెలలు మాత్రమే జీవించియుండిరి. ఆదినములలో వారిహృదయము నీటికన్నను పలుచగా కరగిపోవు చుండెను. దేనిని చూచినను జాలికలుగు చుండెను. శిశువువలె నైపోయిరి. ఒక్కొకయప్పుడు ఒడలుతెలియని సంతోషము, ఒక్కొకప్పుడు చాలదు:ఖమును వారికి కలుగుచుండినవి. ఆ యాఱుమాసములు వా రుండిన విధము వర్ణింపతరముగాదు. ఎవ రేదియడిగినను 'ఇచ్చివేయి' అనువారు, 'మనకు దేవుడిస్తాడురా' అనువారు. ఏమియుందోచక పోయిన ఏనాదిరెడ్డిగారికి జాబువ్రాసి జవాబున కెదురుచూచువారు. లేక కాగితము కలముంగొని తోచినదివ్రాసి చింపివేయుచుండువారు. మరల ఏగ్రంథవ్రాయవచ్చును, దేనికివ్యాఖ్య, ఏకథను నాటకము చేయవచ్చును, రెడ్డి మహనీయులు చేసిన ఈ యుపకారమునకు తగిన ప్రత్యుపకార మేమి చేయవచ్చును, అని ఆలోచించుచు నిరంతరము మంచము మీదపరుండి చుట్టును పుస్తకములనుంచుకొని కాలము గడుపుచుండిరి. వయసు డెబ్బదియైదు.

శ్రీ ఏనాదిరెడ్డిగారు తాము వసూలుచేసిన ద్రవ్యమునుండి ఋణమునకు పోను మిగిలినదానితో మఱికొంత వసూలు చేసి, మహాకవిపూజగా కనకాభిషేకము సేయించి, నిండుసభలో నెల్లూరి పౌరసౌధమున తాతగారిని సత్కరింపదలంచి ప్రయత్నించుచుండిరి. తాతగారు పూర్వము ఋణమును గూర్చి ప్రస్తావము వచ్చినప్పుడంతయు 'నేను ప్రాణంతో ఉండగా కావలెనుగదా'