పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటినుండియు నాయకునివేషమును ధరించుచుండిరి. ప్రతాపలో ప్రతాపుడుగాను, శాకుంతలములో దుష్యంతుడుగాను కీర్తిగాంచినవారు వీరు. తాతగారు దొరస్వామియని పేర్కొనుటకుబదులు వీరిని 'మాదుష్యంతుడు' అని ప్రియముగా వచించువారు. వీరి మధురగానము, సుందరరూపము, ఆదర్శప్రాయమగు నభినయమును నెల్లూరివారికి నేటికిని కన్నులయెదుట నున్నట్లున్నవి. వీరి దుష్యంతపాత్రను చూచి జటప్రోలు ప్రభువులు 'రాజంటేవాడే రాజురా, మిగిలిన రాజులేమి రాజులు త రాజులు' అని వచించిరట నాటి శ్రీ వేంకటగిరి మహారాజావారు నూట పదార్లు సమాజము వారికి పారితోషిక మొసంగిరి. అట్లే వీరి ప్రతాపరుద్రుని పాత్రయు, అనిరుద్ధుని పాత్రయు చూచినవారిది భాగ్యము. బంగారయ్యగారి యుగంధరపాత్ర శాస్త్రులవారి మనసుకు నచ్చినది. కొండగుంట వేంకటరమణశాస్త్రిగారు (బి.ఏ.) పేరిగాడుగా నద్వితీయులై కీర్తివడసిరి. వీరికే ఏనాదిశాస్త్రియని నామాంతరము. వేషమును, ఉచ్చారణయు, అభినయమును వీరిది పరమావధింబొందియుండెడిది. హనుమంతరావు గారు ఉష మొదలైన నాయికాపాత్రలను చక్కగ నిర్వహించువారు. గుంటూరు శివకామయ్యగారి చిత్రరేఖాభినయము శాస్త్రులవారి మెప్పును వడసినది. తాతగారి పద్యములను వారి యభిప్రాయము శ్రోతలకు తెలియునట్లు మనోహరగానముతో చదివినవారిలో వీరగ్రగణ్యులు. యరగుడిపాటి సోదరులు బాణాసురాదిపాత్రలను ధరించుచుండెడివారు.