పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శాస్త్రులవారికి సరస్వతీప్రసన్నమేగాని లక్ష్మీకటాక్షము సంప్రాప్తించలేదు. ఆముక్తమాల్యదకు ఉత్కృష్టవ్యాఖ్యను, సంజీవనీనామకమును, రచించి ముద్రణకార్యమునకై ధనసాహాయ్యముంగూర్చి నన్ను హెచ్చరించిరి. అందులకై నేను అడుగకమున్నే, శ్రీ అల్లాడి కృష్ణస్వామయ్యగారు వేయిరూప్యములను, నిండుహృదయముతో సంతోషముగ నిచ్చిరి. ఇచ్చినదానికంటె ఇచ్చినరీతి గణ్యతరము. ఇది శ్రీ అల్లాడి కృష్ణస్వామియొక్క సహజౌదార్యలక్షణము. వ్యాఖ్యానమెట్లో ముద్రితమైనది. శ్రీ శాస్త్రులవారు, నాయందలి వాత్సల్యాతిశయముచే, ఏతద్వ్యాఖ్యానరంగాధిరోహణ మహోత్సవమును అగ్రపీఠమునుండి నడుపవలసినదిగా నన్నుం గోరిరి. నాకా అర్హతలేదు. సంస్కృతాంధ్రముల పారంగతులైన శాస్త్రుల వారి పరిపక్వామోఘవ్యాఖ్యాన మెక్కడ! తెలిసియు దెలియకపల్కు నే నెక్కడ! ఐనను గురువులయాజ్ఞ. అనుల్లంఘ్యము. ఒప్పుకొంటిని. సభ మద్రాసులో జరిగెను. విద్యాశేఖర ఉమాకాన్తముగారు మొదలగు విద్వద్వరేణ్యులు వచ్చిరి. "కనకపుసింహాసనమున" నేను గూర్చుంటిని అందఱి యెదుట, జంకుపాటుతో, ఆగ్రంథమును గుఱించియు, వ్యాఖ్యానమును బట్టియు, శ్రీ శాస్త్రులవారి జీవితమును, వారి భాషాదోహదాది కౌశల్యమును గూర్చియు వచించుచు, ఏమాత్రము బ్రాహ్మణేతర కవులకు మనభాషా చరిత్రలో తక్కువపాటు ఉద్దేశ్యపూర్వకముగనో లేక నిరు