పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రనియు, ఇతరులగ్రంథముల గుణదోషములను చర్చించుటకు వీరు అధికారులు గారనియు, వీరిమతముచే భాషచెడుచున్నదనియు గ్రహింతురు." అని శాస్త్రులవారు నిరూపించిరి.

ఈవిధముగా శాస్త్రులవారు విమర్శలకుం బ్రారంభించి తమగ్రంథములనేగాక తమ్ము వ్యక్తిపరముగా పత్రికలలో నేమి, మిత్రుల సమక్షముననేమి, సందుదొరకినపుడంతయు దూషించు చుండిన కొక్కొండ వేంకటరత్నము పంతులవారిని వారిశిష్యులను నిరుత్తరులంజేయువారై గ్రంథములను ప్రకటింప నారంభించిరి.

ఈగ్రంథముంజూచి శ్రీశ్రీశ్రీ విక్రమదేవవర్మ మహారాజుగారు తమయభిప్రాయము నిట్లుతెలిపిరి-"ఆంధ్రపసన్న రాఘవ విమర్శనము పఠించినాడను అది కవికల్పద్రుమమనియు, నీషత్పరుషవచన సహితమయినను నిష్పక్షపాతబుద్ధితో జక్కగ బరిశీలించి వ్రాయబడినదనియు, నట్టిపొత్తమును వ్రాయను సామాన్యపండితుల కలవిగాదనియు, నాయభిప్రాయము." అని శాస్త్రులవారు ఇంతపరుషముగా వ్రాసినందులకు కారణములను తెలుపుటకే ఇంతవిస్తరముగా వ్రాయవలసివచ్చినది. 'శాస్త్రులవారూ! న్యాయమా యింతపరుషముగా పంతులవారిని తిట్టడము?' అని గిడుగు రామమూర్తిపంతులవారు తమ 'భాషాభేషజము'లో ప్రకటించినారు. న్యాయమే. ఆకాలపు పరిస్థితుల నెఱిగినవారికి తెలియును.


___________