Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రశస్తమైనది. శాశ్వతమైనది. జంగమ రూపమున సాహిత్యము కృతిభర్తకీర్తిని బహుముఖముల వ్యాపింపఁ జేయుటయే కాక సురుచిర సుస్థితిని జేకూర్చును. ఈ కారణము వలననే కీర్తి కాములకు సాహిత్యకు లాత్మబంధువు లగుచుందురు. 117[1]సాహిత్యకు లందు వ్యాకరణజ్ఞుని బితరుని వలెను, తార్కికుని భ్రాతవలెను, వేదజ్ఞుని చండాలుని వలెను జూచుచుఁ గవిత యలంకరణజ్ఞుఁడగుటచేఁ గవిని వరించినది. కవికి వాఙ్మయకళా వైదగ్ధ్యము వెన్నతోఁ బెట్టిన విద్య.

పూర్వ రాజన్యులలోఁ గొంద రీ రహస్యము నెఱింగిన వారగుటచే నుచితజ్ఞులై విశేషముగఁ గవి సంగ్రహణ మొనర్చిరి. ఎంతటి శ్రమకైన నోర్చి కవుల సంగ్ర హించుటకు మూలకారణము స్తోత్రపాఠాభిమానమే యని మా మతము, కవులు వారి పోషకునికిఁ బుష్టిగల కీర్తి శరీరమును గల్పించి యుగ యుగముల ఖ్యాతిఁ గల్గించినారు.

సమర్ధత గల చక్రవర్తుల కిట్టి యపూర్వ ప్రాభవమును జేకూర్చుట సహజమును సమంజసమును నైయున్నది. అయ్యుఁగొందఱు కవులు తాము 'సత్యరథములకుఁ గట్టిన యశ్వము'లను శ్రుతిప్రమాణముల మఱచి, తమ పోషకులకుఁ గేవలకీర్తి కాయ నిర్మాతలై వారి తుచ్ఛ శృంగారాభిమానమునకుఁ దోహదకారులగుచు తమ యనంత వాగ్వైచిత్రములతో లోకమును మభ్య పెట్టుచు వచ్చినారు. దీనిని గమనించి యుత్తమ ద్రష్ట లొకానొక కాలమున 'కావ్యాలాపాంశ్చ వర్జయే'త్తని యనుశాసింపవలసివచ్చినది.

ఉత్తమశ్రేణికిఁ జెందిన కొందఱు మహాకవులు తాము స్తోత్రపాఠమొనర్చుట కంగీకరింపక మడిదున్నుకొని బ్రతుకఁదలఁచిరి; చారుచరిత్ర, ధర్మచరిత్ర లేని రాజశబ్దవాచ్యులపై నేహ్యభావమును బ్రకటించిరి. అట్టివారిలోఁ బ్రముఖుఁడగు నొక కవీంద్రుఁ డొక సందర్భమున రాజదర్శన మొనర్చి తిరస్కృతుఁడైనపుడు 118[2]'బండిగురివింద పూల పేరులతోఁ దృప్తినందు కిరాతకాంతలకు స్వర్ణ కారునితోఁ బనిలేనట్లు సాధుచరిత్ర లేని రాజులకుఁ గవులతోఁ బని యేమున్నదని ప్రాగల్భ్యము మెఱయఁ బలికివచ్చినాఁడు.

కొందఱు ముష్టికవులు 'ముష్టికి నష్టి' లేదని నమ్మి యపాత్రుల కడకైన నేఁగి యాశుకవితఁజెప్పి యింతయో యంతయో పుచ్చుకొనకపోలేదు. కవి ప్రాశస్త్యమును గుర్తింపలేని వారు వీరిని వందిమాగధ వైతాళికాది గణమునఁ బరిగణించుట పరిపాటియైనది. ఇట్టి భట్టుకవులలో నుద్దండులును గొందఱున్నారు. అల్పదేశ పాలకుడైనను దానొక త్రిలోకాధిపతి నను భావముతోఁ బ్రియఁగూడి రాజ్యమేలు

నొక యేకాక్షి ప్రభువును దర్శించి శుష్కప్రియముల శూన్యహస్తములని
  1. 117. సాహిత్యకులందు - బిల్హణీయములోని "నైవ వ్యాకరణజ్ఞమేవ పితరమ్” ఇందుకు మూలము
  2. 118. బండి గురవింద పూలు బిల్హణుని విక్రమాంక చరిత్రలోని క్రింది శ్లోకము మూలము :

    "కిం చారుచరిత్ర విలాస శూన్యాః
    కుర్వంతి భూపాః కవి సంగ్రహేణ |
    కింజాతు గుంజాఫల భూషణానామ్
    సువర్ణకారేణ వనేచరాణామ్ ||"

____________________________________________________________________________________________________

72

వావిలాల సోమయాజులు సాహిత్యం-4