Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రార్థించుట విన్పించింది. మున్ను వరూధిని ప్రవరునితో నన్న 'వనిత తనంతఁ దా వలచివచ్చినఁ జుల్కనగాదె యేరికిన్' అన్న సాకూతాభిభాషణము వినఁబడియెనేమో!

చ. [1]"తరుణి ననన్య కాంత నతి దారుణపుష్ప శిలీముఖవ్యథా
      భరవివశాంగి సంగభవు బారికి నగ్గముసేసి క్రూరుఁడై
      యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని రోషభీషణ
      స్ఫురణ వహించెనో యన నభోమణి తాల్చెఁ గషాయదీధితిన్.”

కంపించి మఱల నే వరూథినికైనఁ గన్పింపక బయటఁ బడితిని.

అది 'గగనధునీ శీకరముల' చెమ్మ, నంది తిమ్మయ్య పారిజాతోద్యానము. ప్రవేశింపనొక షట్పదకుమారుఁ 'డే వియోగశాలినీ హృదయ రేఖగ’ నో కన్పట్టుచు నా వలె నొక వెఱ్ఱియన్వేషణ మొనర్చుచుఁ గన్పించినాఁడు. అతని యవ్యక్త కంఠధ్వని యందామె సొగసు రేకుల విప్పి యమృత నటనఁ గానుపింపఁబోదు; [2]నా కుగాదులు లేవు నా కుషస్సులు లేవు' మొదలగు ననేక విరహవిధుర భావములు పొడకట్టుచున్నవి. 'పాపము! ఈ మధువ్రతుని బాధ యేమిటి? వాడిపోయిన సుమసౌరభమ్ము కొఱకుఁ గను మొఱంగిన ప్రతిహిమకణమ్ము కొఱకు బ్రతుకు బ్రతుకెల్ల నెదియొ యొక బాష్ప గీతిక వలె' నున్నదే!

ఈ రీతి భావించుచుండ నట నొక గిరిపొంతఁ జక్కగఁ దీర్చి దిద్దిన పూఁదేనియ యేటికాలువ దరిఁ జెంగల్వ పుప్పొళ్లు నించిన సాంద్రోపల వేదిపై నధివసించి యీషత్కషాయ సౌరభమై స్వర్గమునుండి తన సత్య కొనితెచ్చి యిచ్చిన పారిజాత కుసుమ సౌరభ మాఘ్రాణించుచు తిమ్మన్న మహాకవి యా సత్యాదేవికి నూతన ప్రహేళికల నేఱ్పుచున్నాఁడు. వినమ్రభావముతో వారి దరిఁ జేరిఁ మహానుభావా! ఈ బంభరకుమారుని బాధ యే?” మని మున్ను నేఁ జూచినవానిఁ జూపించుచుఁ బృచ్ఛ యొనర్చితిని.

మ. [3]“ఒక భృంగంబు పరాళినీమదనతంత్రోన్మాదిఁ బ్రాణేశ్వరిన్
    మకరందాసవమత్త మజ్జగృహసీమం బెట్టి తాఁబోయి సం
    జకడ న్వచ్చి తదానమన్ముకుళ మే జాడం జొరంరాక యా
    మికుఁడో నాఁ దిరుగున్ - గొలంకు రమకు న్మేలెంత హీనంబొకో!"

యని తిమ్మనవారు సమాధానము చెప్పి తుదకర్థాంతరము నుంచినారు. భ్రమరకుల

విచిత్ర చేష్టలను గూర్చి మఱి యొక విశేషాంశమును గూడ వినిపించినారు.
  1. 82. తరుణి ననన్యకాంత - మనుచరిత్ర ఆ. 3
  2. 83. “నాకుగాదులు” - శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి - కృష్ణపక్షము
  3. 84. ఒక భృంగంబు పారిజా ఆ. 2, ప. 33

మణిప్రవాళము

51