Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూ వివాహము-సంతానము


జాతీయ సభ్యత దేశంలో అభివృద్ధి కావటానికి రాజకీయవేత్తలూ, మతప్రవక్తలూ, సంఘ సంస్కర్తలూ, తదితరులూ తలా ఒక పథకాన్ని అమలు చేస్తుంటారు. ప్రతివారికీ వారి పథకాన్ని అమలు పరిస్తే అభ్యుదయం చేకూరుతుందనే నమ్మకం గాఢతరంగా ఉంటుంది.


దేశీయాభ్యుదయ మంటే - ఆ దేశంలో నివసించే స్త్రీ పురుషుల మానసిక, నైతిక, శారీరకాభ్యుదయం అని అంగీకరించవలసి ఉంటుంది. సంతాన శాస్త్రము దీనిమీదనే ఆధారపడ్డది. సంతాన శాస్త్రమంటూ పుట్టి ఇంకా పాతిక సంవత్సరాలు పైబడలేదు. కానీ అది నేటి సభ్యప్రపంచంమీద ఎంతో భావవ్యాపనం చేసింది. అత్యుత్తమ శ్రేణికి చెందిన మానవ నిర్మాణానికీ, తన్మూలంగా మానవ సంఘనిర్మాణానికీ ఈ శాస్త్రం ఎంతగానో ఉపకరించింది. ఉత్తమ సంతానాన్ని పొందే విధానాన్ని నిరూపించేది సంతానశాస్త్రమని దానిని కొందరు నిర్వచించారు. అది అత్యంత ప్రాధాన్యం కలది కాదు.


ఈ శాస్త్రం, జంతుపాలకుడు వాటిని అభివృద్ధి పొందించటానికి ఏ దృక్పథంతో వర్తిస్తాడో అదేరీతి, మానవాభివృద్ధిని కోరేవాడు మానవజాతిని దర్శించవలసినదని కోరుతుంది. వివాహమన్నా, సంతానమన్నా లోకంలో పాదుకోబడి ఉన్న కొన్ని అభిప్రాయాలను దూరంగా ఉంచమని కోరుతుంది.


ఉదాత్తులుగానో, నీచులుగానో, బలవంతులుగానో, బలహీనులుగానో ఆరోగ్యవంతులుగానో, అనారోగ్యవంతులుగానో వ్యక్తులను తీర్చిదిద్దేది ఏది? - అనే ప్రశ్న మానవుడికి సహజంగా కలుగుతున్నది. ఈ ప్రశ్నకు సక్రమమూ సమగ్రమూ అయిన సమాధానం కేవలం సంతానశాస్త్రం తప్ప మరొకటి ఇవ్వలేదు.


జన్మించి జీవించే ప్రతిప్రాణికీ ఏర్పడుతూ ఉన్న ప్రతి లక్షణానికీ, ప్రతిగుణానికీ ఈ శాస్త్రం రెండు కారణాలను చెపుతుంది. దీనిలో మొదటిది ప్రకృతి (Nature) రెండవది పెంపకము (Nurture). జననకాలంలో ప్రాణికోటికి అబ్బే సమస్తమూ ప్రకృతి తరువాత పోషణ విధానంలో కలిగే వాతావరణమూ, శారీరక సాంఘిక


సంస్కృతి

189