Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చివరభాగముననో లేక 16వ శతాబ్ది ప్రథమ భాగముననో జీవించియున్నాడని నిశ్చయింపవచ్చును. భారతీయ కామకళా గ్రంథములలో దీనికున్నంత విశేష ప్రచారము మరి యే యితర గ్రంథమునకు లేదు. పర్షియా, టర్కీ, అరబ్బు దేశములు దీనిని ఆయా భాషలలోనికి అనువదించుకొన్నవి. ఆ దేశములందు దీనికి 'లజ్జత్ - అల్ - నిస్సా' అని నామము. ఈ గ్రంథమునకు నేడు ఆంగ్లేయ, ఫ్రెంచి, జర్మన్, అనువాదములును లభించుచున్నవి.


తరువాత కాలమున జన్మించిన కవిశేఖర జ్యోతీశ్వరాచార్యుని 'పంచసాయక’ మే నాటిదో తెలియదు. ఇది శ్లోకరూప గ్రంథము. ఇతడు కొక్కోకుని మార్గమనుసరింపక వాత్స్యాయనుని మార్గము త్రొక్కినాడు. అతని చరిత్రాదికములను చెప్పు శ్లోకముల రెంటిని గ్రంథమున చెప్పి ఉన్నాడు. బికనీరు మహారాజు అనూపసింహుని (క్రీ.శ. 1674-1708) ఆస్థాన విద్వాంసుడు, వ్యాసజనార్దనుడు కామప్రబోధము అను గ్రంథమును వ్రాసినాడు. ఇది అనంగరంగమునకు తాత్పర్య గ్రంథము. క్రీ.శ. 1457 నాటి అనంతుని కామసమూహము, జయదేవుని రతిమంజరి, సర్వసామాన్య శాస్త్రగ్రంథములు. హరిభట్టార రహస్యము సంప్రదాయ శుద్ధముగను, కామ సూత్రోద్దేశ నిబద్ధముగను నున్నది. సౌమదత్తి విటవృత్తము వైశికాధికరణమునకు సంబంధించిన స్వతంత్రగ్రంథము, రామచంద్ర బుధేంద్రుని ప్రకాశిక రతిరహస్య వ్యాఖ్యానము. వీరణారాధ్యుని గ్రంథము స్వతంత్రము. ఈ పంచ రత్నమునకు రేవణారాధ్యుని స్మరతత్త్వ ప్రకాశిక వ్యాఖ్యాన గ్రంథము. ఇతడు వేద వేదాంగములనుండి ప్రమాణములనిచ్చి కామము తప్పక సేవింపవలసిన దనియును, ధర్మ్యమనియును నిరూపించిన వీరశైవుడు. సిద్ధ నాగార్జునుడు వశీకరణ తంత్రము నొకదానిని వ్రాసినట్లు తెలియుచున్నది.


ఇట ఆంధ్ర కామశాస్త్ర గ్రంథ ప్రశంస యొనర్చుట అసమ్మతము కాదు. కామశాస్త్రమున కంతటికిని నాయిక వేశ్యయను భ్రాంతిని కల్పించునట్లు, కొక్కోకాది గ్రంథకర్తలవంటి విశేష కామలౌల్యముతో 'కొక్కోక' మను పేర ఆంధ్ర కామశాస్త్ర గ్రంథమును వ్రాసినవాడు ఎఱ్ఱయకవి. ఇది రతిరహస్యాంధ్రీకరణము, నెల్లూరి శివరామకవి తంజాపుర మహారాష్ట్ర నాయకుడు ప్రతాపసింహుని కోరిక పై కామకళానిధి గ్రంథమును వ్రాసినాడు. ఇది స్వతంత్ర గ్రంథము. ముష్టిపల్లి సోమభూపాలుడు ఆంధ్ర రతిరహస్యమును రచించెను. ఇది గద్వాల ప్రభువు హరిభట్టు వ్రాసిన రతిరహస్యమునకు ఆంధ్రీకరణము. గోపీనాథ వెంకటకవి


సంస్కృతి

115