పుట:Telugu merugulu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

తెలుఁగుమెఱుఁగులు



ప్రబంధములలో విరివి సెందిన ప్రాచీనరచనాంకురములను గొన్నింటిని, బ్రబంధములలో నాటక కావ్యానుకరణములను గొన్నింటిని మచ్చున కుదాహరింతును. మార్కండేయపురాణకథ ప్రబంధ మార్గమున విరివిసెంది మనుచరిత్ర మయినది. అందు మృగవర్షనచమత్కారమెల్లం బినవీరన్న శృంగార శాకుంతలములోని మృగయావర్ణనమునుబట్టి పుట్టి పెరిగినది. వర్ణనలెల్లఁ గావ్యసంప్రదాయము ననుసరించి విపులముగా సాగినవి. వరూథినీ ప్రవర సంవాదము మేలయిన నాటకసంభాషణ చ్చాయను బొందుపడినది. శ్రీనాథుని కాశీఖండములోని 'గుణనిధి కథ' పాండురంగకవి నిగమశర్మోపాఖ్యానముగాఁ బెరిగినది. అంతేకాక యాకథ కందుకూరీరుద్రకవినోర నిరంకుశోపాఖ్యానప్రబంధముగానే విరివిసెందినది. పారిజాతాపహరణ ప్రభావతీ ప్రద్యుమ్నములు మహాకావ్య నాటక ధర్మముల కలయికతో వెలసినవి.


శ్రీనాథుని కాశీఖండపద్య మిది
“ముడువంగ నేర్తురు మూల దాపటికి రాఁ
జికురబంధము లింగ జీరువాల
జొన్న పువ్వులఁబోలు పొక్కిళ్లు బయలుగా
గట్టనేర్తురు చీర కటిభరమునం
దొడువంగ నేర్తురు నిడువ్రేలుఁ జెవులందు
నవతంసకంబుగా నల్లిపువ్వు
పచరింపనేర్తురు పదియాఱువన్నియ
పసిఁడి పాదంబులఁ బట్టువెంప
పయ్యెదయు సిగ్గుఁ బాలిండ్లఁ బ్రాకనీరు
తరుచు పూయుదు రోలగందంబు పసుపు
బందిక తెలు సురత ప్రపంచవేళం
గంచియఱవత లసమాస్త్రు ఖడ్గలతలు".