పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
కామేశ్వరీ కథే కామవల్లీ కథ:

పైన ఉదహరించిన కామేశ్వరి కథే క్రమానుగతంగా కామవల్లి కథగా పరిమాణం చెందింది. దీనిని మోటతోలేవారు, కలుపుతీసేవారు, కోతలు కోసేవారు, వడ్లు దంచేవారు, తిరుగళ్ళమీద పిండి విసిరే వారూ ఎక్కువగా పాడుకునేవారు. ఆ విధంగా వారు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ, కష్టాన్ని, అలసటనీ మరచిపోయి ఆనందంగానూ, ఆహ్లాదంగాను ఆయా పనులు పూర్తి చేసుకునేవారు.

గొండ్లియాడే కుండలాకార నృత్యం:

పూర్వంనుంచీ కవిత్వంలోను, సంగీతంలోను, దేశివిధానం, మార్గ విధానం అనే రెండు భిన్న రీతులు ఏర్పడి వున్నట్లు తెలుసుకున్నాం. అందులో దేశి నృత్యాలే ప్రజలకు ఆతి సన్నిహితంగా వ్యాప్తిలోకి వచ్చాయి. పురుషులు కోలాటం వేస్తూ, చిరతలు మ్రోగిస్తూ, చిందులు త్రొక్కుతూ నోటితో పాటలు పాడేవారు. అలాగే స్త్రీలు వలయాకారంగా చప్పట్లు చరుస్తూ బతకమ్మ పాటలు పాడేవారు. ఈ బతకమ్మ పాటలు ఆనాడే, తెలంగాణాలో విశేష ప్రచారంలో వున్నాయి.

అదే విధంగా రాయలసీమలో బొడ్డెమ్మ కథ ప్రచారంలో వుండేది. గొండ్లి అనే కుండలాకార నృత్యంద్వారా బతకమ్మ, బొడ్డెమ్మ పాటల్ని తెలంగాణాలో వున్న మైలార దేవుని పూజల సమయంలో పాడుతూ ప్రజ్ఞలను తెలియజేసేవాళ్ళు.

కుమారగిరి రెడ్డే కర్పూర వసంతరాయలు:

రెడ్డిరాజులలో చివరిరాజు కుమారగిరిరెడ్డి. ఈయన క్రీ.శ. 1386 నుండి 1402 వరకూ - కొండవీడు రాజధానిగా - ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రసిక ప్రభువు. ఈయనకు ధర్మ వేముడని పిలిచేవారు. ఈయన కవుల కవిత్వాన్ని మెచ్చి అనేక పారితోషికాలు బహూకరించేవారు. కుమారగిరికి వసంత రాయలని, కర్పూర వసంత రాయలని రెండు బిరుదులుండేవి. కుమారగిరి స్వయంగా పండితుడు, సంగీత నాట్య శాస్త్రాల్లో ప్రవీణుడు. వసంత రాజీయం అనే నాట్య శాస్త్ర గ్రంథం వ్రాసినట్లు కూడ కాటమ వేమారెడ్డి రచించిన శాకుంతల వాఖ్యవల్ల తెలుస్తూ వుంది.