పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/667

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చకితుల్ని చేసే చెక్క భజనలు


ఆంధ్రదేశపు పల్లెలలో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్క భజన ముఖ్యమైంది. దేవుని స్తంభాలను పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ భక్తి భావంతో భజనలు చేస్తారు. పల్లెలో వుత్సాహం వున్న యువకులందరూ పనిపాటలు లేని తీరిక సమయాలలో ఇరవై మంది దళ సభ్యులుగా చేరి, ఒక గురువును ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో కట్టుదిట్టంగా ఈ విద్యను నేర్చుకుంటారు. ఇది అషామాషీగా చేసే భజన కాదు. ఎవరికి తోచిన రీతిలో వారు గంతులు వేస్తూ చేసే భజన కాదు. ఇది శాస్త్రీయమైన జానపద నృత్య కళ. ఇది ఎంతో క్రమ శిక్షణతో నేర్చుకుని చేయవలసిన కళ.

ఇది చాల శ్రమతో కూడుకున్న కళారూపం. అందరూ సమానంగా అడుగులు వేయాలి. అందరూ ఒకే రకంగా వలయాకారంగా తిరిగాలి. ఒకే రకంగా చేతుల్లో ఘల్లు ఘల్లుమనే చెక్కలను పట్టుకోవాలి. అందరూ కలిపి కట్టుగా తాళం వేయాలి. ఒకే రకంగా ఆగి చలనాలను చూపించాలి. ఒకేసారి ఎగరటం, కూర్చోవటం, గుండ్రంగా తిరగటం. ఎగురుతూ గుండ్రంగా తిరుగుతూ భజన చేయటం చెక్కభజన విశిష్టత. ప్రతి పాటకూ నృత్యం మారుతుంది. పాట మారుతుంది. భావం మారుతుంది. వరుసలు మారుతాయి. తాళం మారుతుంది. తెలుగువారి భక్తిరస కళారూపాలలో చెక్కభజన ఒక సుందర కళారూపం.