పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/648

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండరి భజనలు

ఇది కళారూపం మహారాష్ట్రానిది. పండరిపురంలోని పాండురంగని వేడుకుంటూ చేసే నృత్యం. పండరి భక్తుల ద్వారా దేశమంతటా వ్వాపించింది. ఇది నృత్య ప్రధానమైన భజన. చేతిలో చిరుతలు, నోటితో పాట, పాటకు తగిన అభినయం. ప్రాముఖ్యం వహించే వాయిద్యాలు డోలక్ - మద్దెల, కంజిరా, తంబూరా, తాళాలూ, హర్మోనియం మొదలైన వాయిద్యాలతో కూడిన పండరి భజన ఎంతో ఇంఫుగానూ సొంపుగానూ వుంటుంది.

అందరి భజన:

పండరి భజనల్లో అన్ని తెగల వారూ పాల్గొంటారు. వీరికి గురువు వుంటాడు. ఇతడు పల్లెలు తిరుగుతూ పండరి భజనలు నేర్పుతూ పొట్ట పోసుకుంటాడు. ఈ భజనలు ఒక ప్రాంతమని కాక ఆంధ్రదేశంలో చాల చోట్ల చేస్తారు. ఈ భజనలు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతాయి.

ఈ నృత్యంలో చిన్నపిల్లలే ఎక్కువగా పాల్గొంటారు. పిల్లలకు కాషాయగుడ్డను నడుముకు కట్టించి, పసుపు పచ్చని జెండాను మూరెడు పొడవు కట్టెకు కట్టించి కుడి చేతిలో పట్టిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టి బాలబాలికలు సుమారు ఇరవై మంది దాకా పాల్గొంటారు. గురువు మధ్యలో వుంటూ ఒక్కొక్క భంగిమను చూపిస్తూ వుండగా, చుట్టూ పిల్లలు వృత్తాకారంలో నిలబడి అదే భంగిమను అభినయిస్తారు.

ప్రప్రథమంగా గురువు తాళాన్ని ఇలా ప్రారంభిస్తాడు. తక_తక_త _తక_తక_తక_తకిట_తా_కిట_తకిట_తకిట_తకిట. తరువాత పిల్లలు గురువుకు నమస్కరిస్తారు.

నృత్యం ప్రారంభించే ముందు గ్రామంలోని అన్ని దేవతల పేరులను చెపుతాడు. అప్పుడు పిల్లలంతా ఇలా జై జై అంటారు. పాండురంగస్వామికి జై _ కదిరి నరసిమ్మ స్వామికి,జై గుంతకల్లు కసాపురం ఆంజనేయ స్వామికి జై అంటూ పేరు పేరునా జై కొట్టిస్తాడు.

జై, జై విట్టల్

తరువాత ఈ విధంగా ప్రారంభిస్తారు.

విట్టల్ విట్టల్ - జై జై విట్టల్
పాండురంగ విట్టల్ - పండరినాధ విట్టల్
గోవిందం భజగోవిందమ్
ఆనందం బ్రహ్మానందం.