పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/639

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతోషాల వసంతోత్సవాలు

వసంతోత్సవం ఋతు సంబంధమైన పండుగలలో ఒకటి. వసంత కాలంలో మన్మథుని గురించి వుత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవం గురించి వాత్సాయనుని కామసూత్రాల్లోనూ, శ్రీ హర్షుని రత్నావళి నాటకంలోనూ, కాళిదాసుని మాళవికాగ్ని మిత్ర నాటకంలోనూ ప్రస్తావించబడింది. ముఖ్యంగా రత్నావళి నాటకం ఈ వసంతోత్సవంతోనే ప్రారంభమౌతుంది.

ఆంధ్రదేశంలో ఈ మదన మహోత్సవానికి, వసంత మహోత్సవమనీ, కాముని పండగనీ పాల్గుణ శుద్ధ పూర్ణిమకు కాముని పూర్ణిమ అనీ పేరు. 14 వ శతాబ్దానికి పూర్వం ఈ వసంతోత్సవాలు ఏ విధంగా జరిగేవో తగిన ఆధారాలు లేవు. కానీ కొండవీటి రెడ్డి రాజుల కాలంలోనూ, ఆ తరువాత కాలంలోనూ ఈ వసంతోత్సవాలు ఎలా జరుపబడుతూ వుండేవో తెలుసు కోవడానికి, శ్రీనాథుని భీమేశ్వర పురాణంలోనూ, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక లోనూ వసంతోత్సవాలను గురించి విపులంగా వర్ణించబడింది.

వసంత శోభలు:

ఆ కాలంలో వసంతోత్సవాలకు రాజ నగరునూ, నగరుకు వెలుపలనున్న వుద్యానవనాన్నీ మనోహరంగా అలంకరించి, వుద్యానవనంలో ఒక పూజా మండపాన్ని వివిధ దేవతలకు పూజా వేదికలను నిర్మించి, తోరణాలతోనూ: పుష్పాలతోనూ, సుగంధ ద్రవ్యాలతోనూ వైభవంగా పూజా మండపాన్ని అలంకరించి; రతీ మన్మథులను, లక్ష్మీ, విష్ణువులను, శివ పార్వతులను, దేవేంద్రుడు, శచీ దేవి, వసంతుడు, విఘ్నేశ్వరుడు మొదలైన విగ్రహాలను వేదికలమీద వుంచి, మహారాజు అశ్వారూఢుడై మంత్రుల, సామంతులు, దండ నాయకులు, పురోహితులు, విదూషకులు, పురజనులు వెంటరాగా బ్రహ్మాండమైన మంగళ వాయిద్యాలతో ఉద్యానవనానికి బయలుదేరేవాడు.