పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
కూచిపూడి ఆచార్యులపై సినిమాల ప్రభావం:

కూచిపూడి నాట్యాచార్యులపై సినిమా ప్రభావం కూడ జోరుగా పడింది. సినిమాలలో నృత్యాలు ప్రవేశ పెట్టబడడంతో కూచిపూడి నాట్యాచార్యులు సినిమాల మీదికి దృష్టిని మళ్ళించారు. అలా సినిమాల్లో ప్రవేశించి కీర్తి ప్రతిష్టలు గడించిన వారు వేదాంతం రాఘవయ్య, వెంపటి సత్యనారాయణ, వసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి చినసత్యం, వేదాంతం జగన్నాథశర్మ మొదలైన వారు సినిమాలలో నృత్య దర్శకులుగా వెలుగొందుతున్నారు. వీరిలో వేదాంతం రాఘవయ్య గారు కొంతకాలం నృత్యదర్శకులుగా వుండి ఆ తరువాత కొన్ని చిత్రాలకు దర్శకత్వమూ వహించి ప్రసిద్ధ దర్శకులలో ఒకరుగా వెలుగొందారు.

దాదినమ్మ భాగవత ప్రదర్శనం:

లీలావతి విజయగాథ వీథి భాగవతంగా రచించబడి అల్లంపాటీశ్వరునకు అంకితం చెయ్యబడింది. దీని వ్రాత ప్రతి మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో వుంది. ఈ గాథను దాదినమ్మ భాగవత ప్రదర్శనంగా కూచిపూడి వీథి భాగవతులు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ ఆంధ్ర దేశం అంతటా జేగీయమానంగా ప్రదర్శించారు. ఆ గాథ ఇది.

ఉజ్జయిని రాజైన భోజరాజుకు శివుని వరాన జన్మించిన గారాల బిడ్డ లీలావతి. లేక లేక కలిగిన ఆ బిడ్డకు ఏడుకోటల నడుమ ఒంటి స్థంభపు మేడ నిర్మించి అల్లారుముద్దుగా పెంచు కుంటున్నారు.

దిదిన ప్రవర్థమాన అవుతున్న ఆ సౌందర్యరాశి లీలావతి అంద చందాలను గురించి పురోహితుని ద్వారా విన్న మగధ దేశపు రాజు ముగ్ధుడై, లీలావతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించి ఉజ్జయిని రాజుకు వార్తాహరుని ద్వారా వర్తమానం పంపిస్తాడు. ఇందుకు ఉజ్జయిని రాజు సమ్మతింపడు. ఆ వార్త విని ఉగ్రుడయిన మగధరాజు రాజ్యంలోని గజదొంగలను పిలిపించి ఎవరైతే లీలావతిని తెచ్చి తనకిస్తారో వారికి తన దేశంలో సగం భాగాన్ని దానంగా ఇస్తానని ప్రకటిస్తాడు. కర్ణకరుడనే దొంగ అందుకు అంగీకరించి ఉజ్జయిని నగరానికి బయలు దేరుతాడు.