పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపశమింపజేయడం అందులో కథ. శ్రీకృష్ణుని దక్షిణ నాయక లక్షణాలను, సత్యభామ అష్టవిధ నాయిక లక్షణాలను అవస్థా భేదాలను అద్భుతంగా చిత్రిస్తారు. భామా కలాపంలో సత్యభామ ఒక్కతే పాత్రధారి. సూత్రధారుడు కథకుడు గాను, చెలికత్తె మాధవిగాను సమయానుకూలంగా ద్విపాత్రలనూ ధరించి చక్కని హాస్యాన్ని ప్రదర్శిస్తారు. భామాకలాపం సిద్ధేంద్రుడే వ్రాసినట్లు ఈ క్రింది నాందీ పద్యం ద్వార వెల్లడౌతుంది.

వినరండి హరికథను:

జనులార, వినుడి హరికథ
విన వేడుక గలిగెనేని వీనుల కొలదిన్
కొనుడీ కర్ణామృతముగ
ఘనుడగు సిద్ధేంద్ర యోగి కవితారచనన్.

అనే పద్యంతో ప్రారంభించిన తరువాత సత్యభామ ఈ విధంగా పాడుతూ తెర వెడలుతుంది.

భామనే,సత్యభామనే
భామనే, పదహారువేల
కోమలు లందరిలోనూ
భామరో, గోపాల మూర్తికి
ప్రేమదాసినగు సత్య ॥భామ॥

అట్టహాసము చేసి సురల
నట్టె గెలుచుక పారుజాతపు
చెట్టు దెచ్చి నాదు పెరటా
గట్టిగా నాటించుకొన్నా ॥భామ॥

అంటూ గర్వాతిశయంతో నృత్యం తొక్కుతూ అభినయ చేస్తుంది.