పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని, లేక భాగ్యవంతుల ఇండ్ల ముందరో ప్రదర్శనాలు జరిగేవి. ఈ నాటి మాదిరి ఆనాడు రంగస్థలాలు లేవు. ఎత్తైన ప్రదేశమే రంగ స్థలంగా చూచేవారు. లేనట్టయితే మట్టిని దిబ్బగా పోసేవారు. ప్రదర్శన నాలుగు ప్రక్కలకూ కనిపించేటట్లు పందిరిని నిర్మించేవారు. పైన తాటి ఆకులుగానీ, ఈతచాపలుగాని కప్పేవారు. ఈ నాటి తెరలు ఆనాడు లేవు. మామూలు కలంకారీ అద్దకం బొమ్మల దుప్పటి లాంటిది ఇరువురూ చెరొక ప్రక్కనా పట్టుకుని నిలబడే వారు. ఈనాడున్న లైట్లు ఆనాడు లేవు. కేవలం నూనెకాగడాలమీద, ఇలాయి కర్రల దీపాల మీద ఆధారపడేవారు. ఇరుప్రక్కలా వెలుగునిచ్చే రెండు కంచునూనె కాగడాలు వేశేవారు. పాత్రల ప్రవేశంలో రాజుగానీ, రాణి గాని, యముడుగానీ, కంసుడుగాని ముఖ్య పాత్రల ప్రవేశంలో ఇంత గుగ్గిలాన్ని ఆ కాగడాలపై గుప్పేవారు. ఆ సమయంలో గొప్ప కాంతితో గుప్పుమని మెరిసేది. ఆ మెరుపులో పాత్రలు ప్రవేశమయ్యేవి.

ఈ విధంగా వారు వారి రంగ స్థలాన్ని నిర్మించుకునేవారు. అందుకు గ్రామస్థులందరూ సహాయపడేవారు. ప్రదర్శనానికి కాకితో కబురంపితే సరి చుట్టుప్రక్కల గ్రామలానుండి, జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఇందుకు కారణం ఇంతకు మినహా ఆనాడు వినోద కార్యక్రమాలు లేనే లేవు కనుక.

ప్రదర్శన ప్రారంభం ఎలా జరిగేది:

రాత్రి సుమారు పది గంటలకు, ప్రదర్శనం ప్రారంభమయ్యేది. ఈ లోగా

భాగవతులందరూ గ్రామంలో వున్న ఆయా ఇండ్లలో భోజనం చేయడం గాని, స్వయం పాకంకాని చేసుకునేవారు. రంగస్థలానికి కొంచెం దూరంలో వున్న ఇంటిలో ముఖాలంకరణ చేసుకునేవారు. ప్రేక్షకులందరూ వచ్చేవరకూ సూత్రధారులు వాద్య విశేషాలతో వివిధ రకాలయిన పాటలను పాడుతూ గణపతి ప్రార్థన, సరస్వతి, లక్ష్మీ ప్రార్థనలు చేసే వారు. ఒక ప్రక్క వేషాలు తయారవుతూ వుండేవి. మరో ప్రక్క ప్రేక్షకులందరూ, ఆసీనులై వుండే వారు. గ్రామంలో వున్న పండితులూ, గ్రామ పెద్దలూ, మునిసిఫ్ కరణం మొదలైన పెద్దలందరూ