పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

37

సంవత్సరసంఖ్య లగుటచేతను నేను నాతరగతిలో తొమ్మిదవవాఁడ నైతిని. ఈసంవత్స రార్జితసంఖ్యయు సంవత్స రాంతపరీక్షాసంఖ్యయు నొకటిగాఁ జేర్చి యెక్కువసంఖ్య వచ్చిన మొదటి ముగ్గురికిని బహుమానము లిచ్చుచుండిరి. ఇట్లు చేర్చినసంఖ్యనుబట్టి యాసంవత్సరము నాతరగతిలో నేనే ప్రథముఁడ నైతిని. అందుచేత నాకోరికప్రకారముగా పయిసంవత్సర మంతయు నాకు జీతము లేకుండ విద్య చెప్పున ట్లేర్పాటు చేసిరి. పుస్తకరూపబహుమానము కావలెనో విద్యావేతనరాహిత్యరూప బహుమానము కావలెనో కోరుకొనెడి స్వాతంత్ర్యము ప్రథముఁడుగాఁ గృతార్థుఁ డయినవాని కుండెను. ఆసంవత్సరము మొదలుకొని పాఠశాలలోఁ జదువుకొన్నంతకాలమును నేను చదువునిమిత్తము జీత మియ్యవలసిన యావశ్యకమే లేకపోయెను.

నాలవతరగతిలోఁ జదువుకొనుచున్న కాలములో నన్నుఁగూర్చి నేను విశేషముగాఁ జెప్పుకొనవలసినదేదియు లేదు. తెలివిగలవాఁడననియు, పాపభీతియు దైవభక్తియుఁ గలవాఁడననియు, ఆడినమాట తప్పనివాఁడననియు, సాధువర్తనముగలవాఁడననియు, సత్యము పలుకువాఁడననియు, భావించి పాఠశాలయందలి బాలురందఱు నాయందతిమాత్రగౌరవము కలవారయి యుండిరి. తోడిబాలురకు నాయెడలఁగల యవ్యాజసౌహార్దమునకు నిదర్శనముగా నొక వృత్తాంతము నిందుఁ బొందుపఱుచు చున్నాను. ఒకనాఁడు మధ్యాహ్న కాలమున మామండలన్యాయాధిపతియైన హెన్రీ మారీసుదొరగారు పాఠశాలను జూచుటకయి యాకస్మికముగా వచ్చిరి. ప్రధానోపాధ్యాయుఁ డాయనను వెంటఁ బెట్టుకొనిపోయి యన్ని తరగతులనుజూపి వచ్చినతరువాత దొరగారు పాఠశాలలోని బాలురలో నెల్ల సత్ప్రవర్తనముగలవా రెవ్వరో వారిపేరు వ్రాయవలసినదని విద్యార్థుల కందఱికిని కాగితపుముక్కల నిప్పించిరి. ఎవ్వరి పేరు వ్రాయుదమని యితరులతో నాలోచించుటకు వారి కప్పు డవకాశము లేదు. అందుచేత బాలురందఱును నెవరికిఁ దోఁచినపేరులు వారు వ్రాసి యియ్యఁగా, ఆకాగితపుముక్కల నన్నిటిని పోగుచేసి యందువ్రాయఁబడిన నామ