పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

27

యినతరువాత మాతల్లి యా పేరుమార్చి రాజ్యలక్ష్మియని తనతల్లి పేరు పెట్టినది. ఈ ప్రకారముగా ద్వాదశవర్ష పూర్తి యయినతరువాత నేను బ్రహ్మచర్యాశ్రమమును విడిచి 1861 వ సంవత్సరమునందు గృహస్థాశ్రమమునందుఁ బ్రవేశించితిని.

నా పెండ్లి యయినతరువాత నాపెదతండ్రిగారి భార్యకును నాతల్లికిని తగవులాట లారంభమయినవి. ఇరువురకును మనస్తాపము లావఱకే యుండినను నావివాహానంతరమునఁగాని యవి రగులుకొని ప్రజ్వరిల్లి ప్రకాశము కాలేదు. ఒకయింట నూఱు జుట్లిముడును గాని రెండుకొప్పు లిముడవన్న సామెత యందఱు నెఱిఁగినదే కదా. ఇద్దఱాడువా రొక్కచోటఁ జేరినచోఁ బనిలేని పాటగా నేదోయొకవిషయమున శుష్కకలహములు పొడచూపక మానవు. ఇప్పటి మనదేశపుస్త్రీలలోఁ గానఁబడుచున్న యీకలహప్రియత్వమునకుఁ బ్రధానకారణము స్వప్రయోజనపరత్వముచేత దూరాలోచన మట్టుపడినవారు తమతరుణీమణులను విద్యాగంథవిహీనురాండ్రనుగాఁ జేయుటవలన వారి నాశ్రయించియున్న మౌఢ్యభూతావేశదోషమేకాని సహజకోమలమైన స్త్రీస్వభావము కాదు. స్త్రీలహృదయము లజ్ఞానాంధకారబంధురములయి మౌఢ్య మహారాక్షసదుష్పరిపాలనమునకు లోఁబడి యున్నంతవఱకు నానావగుణపిశాచము లచ్చటనుండి తొలఁగిపోవు. గృహము మహారణ్యసదృశముగాక భూతలస్వర్గము వలె నుండఁగోరినయెడల పురుషులు గృహిణులను విద్యావతులనుగాఁజేసి జ్ఞానదీపప్రభావముచేత నజ్ఞానతిమిరముతొలఁగించి దుర్గుణదురాచార సర్పశార్దూల సంచారములకు వారిహృదయకుహరములయందుఁ జోటులేకుండఁ జేయవలెను.

ఈగృహచ్ఛిద్రములకు మూలకారణ మెవ్వరని యడిగినచో వీరేయని నిర్ధారణము చేయుట సుసాధ్యము కాకపోయినను మొత్తముమీఁద నాతల్లిదే యెక్కువ తప్పిదమనిచెప్పవచ్చును. గడనలేనివారిని వారిబిడ్డలను తమభర్తలు పోషించుచున్నప్పుడు వారియెడల భర్తలెంత యనురాగము గలవారయినను భార్యలుకొంత యసూయగలవారయి యట్టి యనుపోష్యులయెడ ననాదరము