పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

360

స్వీయ చరిత్రము.



తగవులు తీర్పవలసిన భారమును తప్పిపోయినందున, 1892 వ సంవత్సరము మొదలుకొని సమాజమువారు సంవత్సరమున కొక్క పర్యాయము దేశీయసంఘ సంస్కరణ సభకు ప్రతినిధుల నేర్పఱుచుటకయి చేయు సభలుతప్ప వేఱు సభలు లేక విశ్రాంతి సుఖము ననుభవింపఁజొచ్చిరి. వివాహములను నాసొంతసొమ్ముతో నామనసువచ్చినట్లు నేనే సమాజమువారి యాదరణము క్రింద చేయఁజొచ్చితిని. 1892 వ సంవత్సరములో రెండు వివాహములును 1893 వ సంవత్సరములో రెండు వివాహములును, ఈప్రకారముగా 1907 వ సంవత్సరమున నేను చెన్న పట్టణమునకు వెళ్లునప్పటికి పది వివాహములు చేసితిని. ఈవివాహదంపతుల కిండ్లిచ్చు పద్ధతినిగాని నగలుపెట్టు పద్ధతినిగాని నేను పెట్టుకోలేదు. మట్టెలు, మంగళ సూత్రములు, నూతనవస్త్రములు, తాంబూలాదులు, వాద్యములు, భోజనములు మొదలయినవానిక్రింద నూఱురూపాయలకు మించకుండ వ్యయముచేయ నిశ్చయించుకొని యాప్రకారముగా చేయుచుంటిని. నాకు ధనము కావలసి వచ్చినప్పుడెల్లను నామిత్రులయిన న్యాపతి సుబ్బారావు పంతులుగారి ప్రీతి పూర్వకముగా నాకు బదులిచ్చి నేనిచ్చినప్పుడు వడ్డి గైకొనక యసలుమాత్రము పుచ్చుకొనుచుండెడివారు. ఇరువదియేడవ వివాహముచేసి నేనిక్కడనుండి చెన్న పురికిఁబోయితిని. అక్కడ ముప్పదియైదవ వివాహము జరగుచుండగా ఆత్మూరి లక్ష్మీనరసింహము సోమయాజులుగారు నన్ను చూడవచ్చిరి. అప్పుడు నేనాయనతో ప్రసంగవశమున ధనము లేకపోవుటచేత సత్కార్యాములు సాగక నిలిచిపోవనియు, అప్పటికి రామకృష్ణయ్యగారి ధనముతో చేయఁబడినవానికంటె ద్విగుణముగా వారి ధన సాహాయ్యము లేకయే చేయఁబడినవనియు, ప్రస్తావించితిని. ఆయన వధూవరులకు కట్నము చదివించి సంతోషించిపోయెను. తేరగా ధనము వచ్చునన్న యాశ లేక పోవుటచేత నిప్పటివరుల కతృప్తిలేదు. ధనార్థముగా నాకు వారివలన పీడలేదు. రాఁగారాఁగా వివాహవ్యయమును నూటినుండి యేఁబదికిని, ఏఁబది నుండి యిరువదింటికిని, దింపినాను. ఇప్పుడు చేయుచున్న కొన్ని వివాహములకు వ్యయములను వరులు తామే భరించుచున్నారు.