పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

స్వీయ చరిత్రము.

యెట్టిదో యెఱుఁగనివాని నెట్లుదండింతు ననియు, అయినను మీవాని మీఁద నిఁకముం దొకకన్నువేసి చూచుచుండెదననియు చెప్పి యాయన వారిని బంపివేసెను. ఆయన చెప్పినట్లు నే నల్లరిచేయక, అయోగ్యముగాఁ బ్రవర్తింపక, పాఠశాలలో నుపాధ్యాయులకెల్లఁ బరమవిధేయుఁడ నయియే యుండెడివాఁడను. అది పోనిండు. పయియ ట్లుభయులలోనెవ్వరు చెప్పినదియు నసత్యము కాదు. నే నింటికడ నింగ్లీషుపాఠములను జదువ కుండుటయు సత్యమే; పాఠశాలలోఁ బాఠములఁ జక్కఁగా నొప్పగించు చుండుటయు సత్యమే; ఏకసంధాద్విసంధాగ్రాహుల కుండుబుద్ధివి శేషము కొంత కలవాఁడ నగుటచేత నే నింటినుండి పాఠశాలకుఁబోవుచు నొకసారియో రెండుసారులో దారిలోఁ బాఠమును జూచినంతమాత్రముననే నా కది ముఖస్థమయి యప్పటికి తప్పులులేక యప్పగింప శక్తుఁడ నగుచుంటిని. ఇట్లు నాప్రతిభావిశేషమే నా కశ్రద్ధను సోమరితనమును నేర్పి, యీవఱకు సూచించినట్లు కొంతవఱకు నన్నుఁ జెఱిచినది. నే నప్పుడు చదివిన పాఠము నప్పటి కప్పగింపశక్తుఁడ నగు చుండినను, చదివినచదువు దృఢముగా మనస్సునఁ బట్టక కొన్నిదినము లగునప్పటికిఁ జదువనట్టే యుండి మరల మొదటికి వచ్చుచుండెడివాఁడను. ఏకరీతిని స్థిరముగాఁ బాటుపడక సోమరిగానుండు సూక్ష్మబుద్ధికంటె నిరంతరము నేకరీతిని బాటుపడుచు, అనలసుఁడుగా నుండు మందబుద్ధియే లోకమునకును దనకును నెక్కువమేలును జేయఁగలవాఁడగును. లోకమునకు మహోపకర్తలయి ప్రసిద్ధికెక్కినమహా పురుషులందఱును నిరంతరకర్మశూరు లయిన సామాన్యధీశాలులుగాని కేవల ప్రతిభామాత్రమాన్యు లయినవారుగారు. బుద్ధిసూక్ష్మత కుద్యోగశీలత తోడు పడినపక్షమున నత్యధికప్రయోజనకరము కావచ్చును. నేను గొన్నిసమయములయందు దారి నడచునప్పుడు పాఠములు చదువలేకపోయినను, నా వంతు మొట్టమొదటనే రాక యొకరిద్ద ఱొప్పగించినతరువాత వచ్చినపక్షమునఁ బాఠమును - నిర్దుష్టముగా నొప్పగింపఁ గలిగెడివాఁడను. చదువనినాఁ