పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

299



నున్నదనియు తాను వైద్యుని నిమిత్తము వెళ్లుచున్నాననియు, నతఁడు చెప్పెను. వైద్యుని నేను తీసికొనివచ్చెదననిచెప్పి, భార్యవద్ద నుండుటకయి వచ్చిన బండిలోనే యతనిని మరల నింటికిఁ బంపివేసి, నేను మిక్కిలి బడలియున్నను వెనుక తిరిగి వైద్యునియింటికి నడిచిపోయి, యాయనను వెంటఁగొని తిన్నగా నిన్నీసుపేటకు శేషయ్యగారి యింటికిఁబోయి తగిన చికిత్సలు చేయించి, పిమ్మట నింటికి భోజనమునకుఁబోయితిని. నేను భోజనముచేయఁగానే గవర్రాజుగారి యింటికిఁబోయి యాయననుగూడఁ దీసికొని మరల నిన్నీసుపేటకుఁబోయితిమి. మేమిరువురమును రాత్రి యెనిమిది గంటలవఱకును శేషయ్యగారియింటియొద్ద నున్నపిమ్మట గవర్రాజుగారు నన్ను మాయింటికి తీసికొనివచ్చి, నాది దుర్బలశరీరముగుటచేత జబ్బు చేయునని భయపడి నన్ను రాత్రి మరల రాకుండునట్లు వేఁడుకొని యొప్పించి, తానింటికిఁబోయి భోజనముచేసి తిరిగి యిన్నీసుపేటకుఁ బోయెను. విధివశముచేత శేషయ్యభార్య కాలవశము నొందెను. అప్పుడు పుట్టిన యాపురుషశిశువును బహుసంవత్సరములకు తరువాత నాతఁడు తాను కాలధర్మము నొందునప్పుడు నాకొప్పగించెను. నేనాపిల్లవానిని నాయొద్ద నుంచుకొని పెంచి విద్య చెప్పించితిని. అతఁడిప్పుడు వివాహముచేసికొని తనకు కలిగిన పురుష శిశువుతో సుఖముగా మాతోటలోనే యున్నాఁడు.

మిత్ర సాహాయ్యముతో కృషిచేసి నేను రాజమహేంద్రవరసు క్షేత్రమున విత్తనమువేసి మొలిపుంచిన విశ్వస్తావివాహనవలతాంకురమునకు పట్టుకొమ్మయయి నానాముఖముల తీగలు సాగించిన శ్రీపైడారామకృష్ణయ్య గారు బాలవితంతువుల యభాగ్యముచేత 1886 వ సంవత్సరము మార్చినెల 28 వ తేదిని ప్రాతఃకాలమున స్వర్గస్థులగుట తటస్థించెను. ఈయన మరణమునుగూర్చి నేను 1887 వ సంవత్సరారంభమున చెప్పినమాటలనే నిచ్చట మరలఁ జెప్పుచున్నాను. "స్త్రీ పునర్వివాహ ప్రయత్నమునకెల్లను రామకృష్ణయ్యగారు ప్రాణముగా నుండెడివారు: అటువంటివారు లోకాంతరగతు