పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

స్వీయ చరిత్రము.

ఆయన యుత్తరమునకు బదులుగా మున్నూఱు రూపాయలు కావలసి యుండునని నేను వ్రాసితిని. అందుమీఁద 24 వ పిబ్రవరి 1886 వ సం|| కాకినాడనుండి వారు నాకిట్లువ్రాసిరి. -

"వివాహ విషయమైన మీయుత్తరము నాకందినది. నేను రు 300 లు మీకి పంపెదను. కాఁబట్టి వివాహ మారంభించి నాకు తంతివార్త పంపుఁడు. నేను సొమ్ము పమెదను." [1]

ఈ నడుమను పెండ్లిచేసికొన్న కొందఱివలన కలిగిన కొన్ని చిక్కులను బట్టి యీక్రొత్తపెండ్లికొడుకును పిలిపించి, సంవత్సరకాలము చదువునిమిత్తమయి నెల కెనిమిదేసిరూపాయల చొప్పున నిచ్చెడిదితప్ప మావలన ధనముగాని యిండ్లుగాని నగలుకాని మఱియేదికాని యపేక్షింపఁగూడదని స్పష్టముగా చెప్పి, యతఁడందున కొప్పుకొన్న మీఁదట నతనిచేత నుత్తరమువ్రాయించి పుచ్చుకొని, మార్చి నెల మూడవతేదిరాత్రి వివాహ మేర్పఱిచి, మండల న్యాయాధిపతి మొదలైన వారి కందఱికి నాహ్వానములు పంపితిని. వారందఱును వచ్చి వేచియుండిరికాని పెండ్లికొమారుఁడు రాకపోవుటచేత పెండ్లి నిలిచిపోయినది. ఈ సంగతులను దెలుపుచు నేను వ్రాసినలేఖ కుత్తరముగా మార్చినెల 5 వ తేది రామకృష్ణయ్యగారు నాకిట్లువ్రాసిరి. -

"పెండ్లికి లిస్టరుదొరగారు మొదలైనవారిని పిలిచితినిగాని పెండ్లికొడుకు రానందున పెండ్లి జరగలేదని తెలుపుచు మీరువ్రాసిన యుత్తర మందినది. అటువంటి యాశాభంగములు కలుగునని నేనెఱుఁగుదును. ఇల్లు కోరఁగలవాఁడను కానన్న షరతులో నతని వద్దినుండి మీరుత్తరము పుచ్చుకొన్నట్టు మీయుత్తరములో చెప్పితిరి. మన మిల్లీయక పోయినయెడల,

  1. "Cocanada, 24th February 1886. My dear friend,

    I have received your letter about the marriage. I shall send you Rs 300, so please commence the marriage and telegraph me, I shall despatch the money."