పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

239



కొఱ కోడలోని కెవ్వరును రాలేదు ; మేమే పడవ మాటాడుకొని యొడ్డున దిగితిమికాని యక్కడ సహితము మానిమిత్త మెవ్వరును వేచియుండలేదు. ఇల్లు కుదుర్చిరో లేదో, మేమేమి చేయవలెనో, ఎక్కడకు పోవలెనో, తెలిసినదికాదు. అందుచేత మావారినందఱిని అక్కడనే నిలిపి నేనొక్కఁడను దాని సమీపముననే యున్న చెంచలరావు పంతులుగారి కార్యస్థానమునకు పోయి మాయస్థను దెలిపితిని. ఆయన యద్భుతపడి రఘునాధరావుగారు తీరమున మీ నిమిత్తము మనుష్యుల నుంచలేదాయని యడిగి, జరిగినపనికి మిక్కిలి నొచ్చుకొని, క్షమార్పణముచేసి, రఘునాథరావుగారి యింటిప్రక్కనే యిల్లు కుదుర్పఁబడెనని చెప్పి, ఆయింటికి మమ్ముఁ గొనిపోవుటకయి యొక భటుని నిచ్చెను. మేము గుఱ్ఱపుబండ్లు మాటాడుకొని మైలాపురము చేరితిమికాని యిల్లు చేరునప్పటికి కాయింటికి బైట తాళము వేయఁబడి యుండినది. పంతులుగారు పంపిన భటుఁడుపోయి బీగము తీసికొనివచ్చి వీధి తలుపు తెఱచెను. ఆయిల్లు విశాలమైనదేకాని యింటివారిలో నెవ్వరో చెడ్డ నక్షత్రమందు మృతినొందుటనుబట్టి కొన్ని నెలలనుండి పాడుపఱుపఁబడి యుండిన దగుటచేత గబ్బిలముల పెంటతోను ఎలుకలు త్రవ్వినమంటి రాసులతోను వాసార్హముకాకుండెను. మేమంగడికి పంపి వస్తుసామగ్రిని తెప్పించుకొని యిల్లు బాగుచేసికొని వంటచేసికొని భోజనములు చేయునప్పటికి రాత్రి యెనిమిదిగంటలయినది. చెంచలరావు పంతులుగారు తమ కార్యస్థానమునుండి తిన్నగా మాయింటికేవచ్చి మాక్షేమసమాచారము విచారించి యరగంట సేపు నాతో మాటాడుచుఁ గూరుచుండి తమయింటికిఁబోయిరి. నా రాకవిని మఱునాటినుండి నన్ను చూచుటకయి మిత్రులు మొదలైనవారు రాఁదొడఁగిరి. వారు వివాహమెప్పుడని యాత్రముతో నడుగుచు రాఁగా నెనిమిదవ తేదిని జరగవచ్చునని చెప్పుచు వచ్చితిని. వచ్చిననాఁడు రఘునాథరావుగారి దర్శనము కాలేదు. మఱునాటి ప్రొద్దున వారి దర్శనము చేయుటకయి పోయితినిగాని వాకిటనున్న భటులు సమయముకాదని చెప్పినందున వెనుక మరల