పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

221



టకు పోవనున్నట్టును, వర్తమానము తెలిసినందున, ఆయెండలో పరుగెత్తుకొని పోయి సాయంకాలము నాలుగుగంటలవేళ కాలువమీఁదిపడవలో దొరగారిని సందర్శించి సంగతి విన్నపించితిని. అతఁడాచిన్న దానిని పట్టుకొనకుండ పోలీసు యుద్యోగస్థుల కుత్తరువు పంపెదనని చెప్పి నన్ను పంపివేసెను. ఇఁక పెండ్లి కొమారుని తీసికొని పోవలసినపని యొకటిమిగిలియున్నది. అందుచేత నే నాయనవద్దనుండి తిన్నగా హిందూపాఠశాలకు పోయి యక్కడ నుపాధ్యాయుఁడు గానున్న యాతనిని కలిసికొని నావెంటరమ్మని పిలువఁగా అతఁడీ యభియోగవార్తను వినుటవలనను జనులవలని భీతివలనను కొంతజడిసి నా వెంట రాకుండుటకయి కొన్ని సాకులు చెప్ప మొదలు పెట్టెను. కాని, నేనన్ని టికిని తగిన పరిహారములుచెప్పి, పాఠశాలనుండియే తిన్నఁగా నే నాతనిని పడవవద్దకు బలవంతముగా తీసికొనిపోయి నాగదిలో కూరుచుండఁ బెట్టుకొనఁగా, తన్న ప్పుడు విడిచి పెట్ట వలసినదని నతఁడనేకవిధముల ప్రార్థించియు నేను పూనికను విడువనందున నామాట తీసివేయలేక నాతోవచ్చి మఱునాఁడు తెల్లవాఱిన తరువాత తాను తొడుగుకొన్న యంగీయు తలగుడ్డయు నుత్తరీయమును నా గదిలోనేయుంచి గురుశంకకు పోయివచ్చెదనని నాతోచెప్పి మేడపాడు దగ్గఱ పడవదిగి వెనుకకు పాఱిపోయెను. నేనుమాత్రము నాఁడు మధ్యాహ్నము రెండుగంటలకు రాజమహేంద్రవరముచేరి, ముందుగా తంతివృత్తాంత కార్యస్థానమునకుపోయి పెండ్లికొమారుని చర్యను కాకినాడలోని లచ్చిరాజుగారు మొదలైన మిత్రులకు తంత్రీముఖమునఁదెలిపి యింటికిఁబోయి మూడవనాఁడు అపరాహ్న మయిన తరువాత మూడుగంటలకు భోజనముచేసి, అప్పుడే రామకృష్ణయ్యగారు మొదలైన మిత్రులకందఱికిని వరునిమరలఁ బంపుటను గూర్చి యుత్తరములు వ్రాసితిని. పెండ్లికొమార్తెమీఁది యభియోగ మామె వివాహము చేసికొనఁబోవుచున్నదన్న ద్వేషముచేత తెచ్చినదయినట్టు కనఁబడుచున్నందున, ఆమెనుపట్టుకొనవలదని పోలీసువారికి స్యూపరింటెండెంటు వద్దనుండి వెంటనే యుత్తరువువచ్చెను. తరువాత కాకినాడకు మనుష్యులను