పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

219



బంట్రోతులకు రు. 4-0-0

కోదండ రాయ్యగారికి రు. 5-0-0

కాగడా రు. 0-8-0

చమురు రు. 1-2-0

అందుమీఁద మేము చేసినప్రయత్నమును చిన్నదానిపేరును సమస్తజమకును వెల్లడి యయిపోయినవి. ఎల్లవారును ఈవివాహమునకు విఘ్నము కలుగఁ జేయుటకై చేయవలసిన ప్రయత్నముల నన్నిటినిజేసిరి. అయినను మాయుత్తర ప్రత్యుత్తరముల సంగతిమాత్ర మెవ్వరికిని తెలియక రహస్యముగానే యుండినది. అందుచేత మేము మఱియొక యుపాయము నాలోచించి మా వర్తన మెవ్వరికిని భేద్యముకాకుండునట్లు గోప్యముగా నిర్వహించి పరమ నిపుణుఁడును మాకు పరమవిశ్వాసియునయి మాముద్రాశాలలో పనిలోనుండిన మునిసామిని పెద్దాపురమునకుఁ బంపితిమి. ఆతఁడెవ్వరికిని ననుమానము కలుగకుండ మార్గస్థునివలె నటించి రాత్రి వారి వీధియరుగుమీఁదనే పరుండి తన సందేశము నాచిన్న దానికి తెలిపి నేర్పుతో పనిచేసెను. అమావాస్యనాఁడు రాత్రి రెండుజాములవేళ మబ్బుపట్టి చినుకులు పడుచుండఁగా తనతండ్రికి తలనొప్పి వచ్చుటచేత నుపచారములు చేయుచున్న తల్లి మొదలైనవారి నేమఱించి లఘుశంకకుపోవు మిషమీఁద వీధిలోనికివచ్చి యాచిన్నది మామనుష్యునితో తాను వచ్చుటకు సిద్ధముగానున్న సంగతిని తెలిపెను. అతఁడు వెంటనే యాచిన్న దానిని వెంటఁగొని బైలుదేఱి, కొంతదూరము పోయినతరువాత తానావఱకు తీసికొనిపోయిన బట్ట లాచిన్న దానికికట్టి పురుషవేషమువేసి, పగలు చూచుకొనివచ్చిన మాఱు మూలదారిని గాఢాంధకారములో వానలో తడియుచు పరుగెత్తి, కొంతదూర మాచిన్న దానిని నడిపించియు కొంతదూర మెత్తుకొని మోచియు తెల్లవాఱునప్పటికి రెండామడలు నడచి, అక్కడ బండిచేసికొని మఱునాఁడు పగలు రెండుజాములవేళ నామెను మాయింటికిఁ జేర్చెను.