పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

స్వీయ చరిత్రము.



దానికందఁజేయుచు, ఆచిన్న దానియుత్తరములు నాకుచేరునట్లుచేయుచు, నాకెంతో సహాయుఁడుగానుండెను. ఈయనయే యొకసారి యాచిన్న దానిని చామర్లకోటలో పడవయెక్కించి తీసికొనివచ్చు నట్లేర్పాటుచేసి పడవనంతను కుదిర్చి యుంచితిమికాని యా ప్రయత్నము కొనసాగినదికాదు. ఆచిన్నదాని యింట పనిచేసెడి యొకకుఱ్ఱది యాచిన్నది వ్రాసిన యుత్తరములను నాకు పంపుటకయి రహస్యముగా మనోహరము పంతులుగారి యింటనిచ్చుచు, నేను వ్రాసి మనోహరము పంతులుగారి యొద్దకు పంపినయుత్తరములను గొనిపోయి రెండవ కంటివాఱెఁగకుండ నాచిన్న దాని కందిచ్చుచు, ఉండెను. లేత వయస్సులోనున్న జవ్వనులకు నిరంతర వైధవ్యదుఃఖమునకంటె మరణమే మేలుగా నగపడునుగనుక, తా నేలాగుననైన దుస్సహవైధవ్య బాధనుండి బయలఁబడి సుఖింపఁగోరి యాచిన్నదే తన్నుఁగొనిపోవుటకుఁగల వివిధమార్గములను మాకుపదేశించినది. ఆమెచెప్పినయుపాయము ననుసరించి తగినంతమందిని పల్లకి మోచువారిని నియమించి, లక్ష్మీనరసింహముగారు దయాపూర్వకముగా నిచ్చిన యిద్దఱు భటులను తోడిచ్చి మామిత్రులయిన నల్లగొండ-కోదండరామయ్య గారిని మనోహరము పంతులుగారికి వ్రాసియిచ్చిన యుత్తరముతో పెద్దాపురము పల్లకిలోపంపి, ఆచిన్న దానిని రాత్రివేళ సంకేతస్థలములో కలిసికొని పల్లకిలో నెక్కించుకొని తెల్లవారునప్పటికి రాజమహేంద్రవరము తీసికొనివచ్చి మాయింటవిడుచునట్లు తగినయేర్పాటులన్నియు చేసితిమి. వివాహమగునన్న నిశ్చయముతో నేనావఱకే చెన్న పట్టణమునుండి వేయిరూపాయలను తెప్పించి యాత్మూరి లక్ష్మీనరసింహముగారియొద్ద నుంచితిని. ఈ సందేశమునకయిన వ్యయములను వారే యాసొమ్ములోనుండి చేసి నాకు లెక్క వ్రాసియిచ్చిరి. కొందఱు వెళ్ళినచోట నేర్పుతో కార్యములను సాధించుకొనివత్తురు; కొందఱు బుద్ధిమంతులయ్యును నుపాయప్రయోగ నైపుణ్యము చాలక కార్యసాఫల్యమును బొందరు. ఈ సంగతి యేలాగుననో కొంచెము పొక్కి ఆచిన్న దానిబంధువులకు ముందుగా తెలియఁగా వారు జాగరూకులయి