పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

స్వీయ చరిత్రము.



పట్టణములో పనిచేయుటకును, వితంతువివాహపక్షమున నేనాయనను నియమించితిని. ఆయన చెన్నపురికి పోవుచు దారిలో కాకినాడనుండి 1882 సం|| ఆగస్టు 24 వ తేదిని నాకిట్లువ్రాసిరి : -

"నాప్రియగౌరవనీయమిత్రుఁడా !

"ఎల్లోరా పొగయోడ నేఁడిక్కడ ప్రతీక్షింపఁబడుచున్నది. అందుచే నేను వెళ్ళిపోవుచున్నాను. పై-రా-గారిని, జడ్జినిచూచితిని. నేను డర్హాము గారినికూడ దర్శించితిని. పై-రా-గారిని కార్మెకల్, చెంచలరావు మొదలైన వారికి తంత్రీవార్తలు పంపునట్లుచేసితిని. సబుజడ్జి అప్పీలులేదని తలఁచుచున్నాఁడు. ముందుముందు మనము సివిల్ వ్యాజ్యము తీసికొనిరావచ్చును. డర్హాముగారును సబుజడ్జియు నాకావిషయమున దీర్ఘోపన్యాసములనుచేసిరి. లచ్చిరాజుగారు, రామారావు మొదలయినవారిని చూచితిని. తన్ను స్వశాఖవాని కెవ్వనికైన వివాహము చేయుమని కోరుచు స్వహస్తముతో ఆచిన్నది మీపేర వ్రాసినయుత్తర మొకటి వారియొద్దనున్నది. వివాహమీ నెలలో జరుపఁబడవచ్చునని నేను తలఁచుచున్నాను. రేపుగాని పయి శనివారమునాఁడుగాని మీయొద్దకు పోవలసినదని నేను పెండ్లికుమారునితోఁ జెప్పితిని. ఆచిన్నది యొక్కపర్యాయము తల్లిదండ్రుల యొద్దనుండి తొలఁగింపఁబడిన పక్షమున అప్పుడు తల్లిదండ్రులవద్దకు మరల పోవలెనన్న మోహమునంతను ఆమె మరల్చుకోఁగలదు. ఈ వివాహమును గూర్చి నేను సబుజడ్జితో మాటాడలేక పోయినందుకు విచారించుచున్నాను. మరల నొక్కవివాహము జరిగింపఁబడిన పక్షమున, అప్పుడు మఱి-కొన్ని జరిగించుట కాశయున్నది. ఈసంగతులు నాతోచెప్పఁబడినవి.

మంచిది. ఈప్రయాణమువలనఁ గలిగిన ధనకాలనష్టము లటుండఁగాను, శ్రమయటుండఁగాను, ఒక్కవిషయమయి నేను రాజమహేంద్రవరమునువిడిచి నందుకు చింతనొందుచున్నాను. మిక్కిలి విలువగలవని నేను తలంపవలసినవి యిప్పుడు రాజమహేంద్రవరములో రెండు ఆత్మలున్నవి. అతి శ్రమపడుచు