పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

169



ముగా శ్లాఘింపవలసియున్నది. పదిమంది యొక్కసారిగా లోకాంతరగతులయినప్పుడు పుట్టునంత సంక్షోభము ఈ వివాహదినమున వార్తియింటపుట్టినది. భార్యవంకవారును తన వంకవారునయిన బంధువులొక్కసారిగా గొల్లున గోలపెట్టి మధ్యాహ్న సమయమున మృతునినిమిత్తమయి యేడ్చునట్లేడ్చుచు శపించుచు లేచిపోయిరి. తల్లిదండ్రులు చిన్న తనములో పోయినప్పటినుండియు పెంచి పెద్దవానినిజేసిన పెద్దతల్లి తన్ను విడిచిపోయినను వెనుకతీయక, లోకోపకారము నిమిత్తమయి యెన్నికష్టములు వచ్చినను సహించుకొని యుండి, భార్య దీర్ఘ వ్యాధిచేత బహుమాసములు మంచమెక్కియుండి బంధువులురాక బహు బాధలు తటస్థించినను ప్రాయశ్చిత్తమన్న పేరునైనను తలపెట్టక, ఈ దినమువఱకును పరోపకారమయిన యీ కార్యమునిమిత్తము వ్యయప్రయాసములను సంతోష పూర్వకముగా వహించుచున్న యా నామిత్రుని నెట్లుశ్లాఘింపవలయునో నేనెఱుఁగకున్నాను."

1888 వ సంవత్సరము జూలయి నెలలో నిట్టి మిత్రరత్నము గోలుపోయిన యభాగ్యము నాకుసంప్రాప్తమయినది. మరణపర్యంతమును నన్ను ను నేను పూనిన వితంతువివాహపక్షమును విడువక ప్రాయశ్చిత్తమునకు లోఁబడకయుండిన మహాపురుషుఁ డీయనయొక్కఁడే. నాకింతటి సహాయుఁడయి యుండియు మాయిరువురివిషయమునను డాక్టరు సత్యనాథముగారు 1885 వ సంవత్సరాంతమున మెయిలు పత్రికకు వ్రాసినప్పుడు తనదినచర్యయందు విధేయత తేటపడునట్లుగా నిట్లువ్రాసికొనిరి : -

"వితంతు వివాహసంబంధమున నాపేరును వీరేశలింగముగారిపేరును ఉదాహరించుటచే మాయందాయనకెంతో దయకలదని భావించెదను. కాని యీగొప్పకులాచార సంస్కారకార్యమునందు నేనుచేసినపని యత్యల్పమయినదని సిగ్గుపడుచున్నాను. నాసరియైనస్థితి సత్యనాథముగారి కొక వేళ తెలియకుండ వచ్చును. నేను చేసినదంతయు ఈ పక్షము వారితో భోజనము చేయుటయు వీరేశలింగముగారిని ఇతరవిధముగా ప్రోత్సాహపఱుచుటయునే. నేనులేకుండ