పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

స్వీయ చరిత్రము.



విపక్షుఁడునయినను, రెండవ యన్న గారైన రంగయ్యపంతులు గారు నాకు చిరకాల మిత్రుఁడును సంస్కార పక్షానుకూలుఁడును నయినవాఁడే. అయినను బహుజన సంక్షోభసమయమునందు బంధుజన బహిష్కారమునకు భయపడ కుండుట సామాన్యులకు సాధ్యముకాదుగదా ! బాపయ్యగారివలెనే నాకు పరమమిత్రుఁడును మాయాంతరంగిక సామాజికులలో నొక్కరును వితంతు వివాహపక్షమునంద సమానాదాదరముగలవారునునయిన న్యాపతి సుబ్బారావు పంతులుగా రారాత్రి వివాహమునకు రావలెనని యెంతో ప్రయత్నము చేసిరి కాని వారుకాపురముండిన యింటివారారాత్రి పెండ్లికిఁబోయినయెడల మరల నింట నడుగిడనియ్యమని స్పష్టముగాఁ జెప్పినందున రాలేక పోయిరి. ఆయన కప్పుడు స్వగృహముండినయెడలను, ఉండిన యింటివారైన బంధువు లంత నిర్బంధ పఱుపకపోయినను, అప్పుడుండిన యుత్సాహమునుబట్టి వారు తప్పక వివాహమునకు వచ్చియుందురు. కొందఱీ ప్రకారముగా ననివార్య ప్రతిబంధములచేతను, కొందఱు స్వాభావిక భీరుత్వముచేతను, రాలేకపోయినను, దైర్యశాలులును దేశాభిమానులునయిన నామిత్రులనేకులు వివాహదినములలో తాంబూలములకు మాత్రమేకాక భోజనములకు సహితము వచ్చిరి. అట్టి యమూల్యసాహాయ్యముచేసి నాకుతోడుపడి పెక్కుకష్టములకు లోనైన వారియెడల నే నత్యంతకృతజ్ఞత గలవాఁడనయి యున్నాను. ఇట్టివారిలో నగ్రగణ్యులయిన యొక్కరినిగూర్చి నేను చెన్న పురిలో 1885 వ సంవత్సర మధ్యమున నేనిచ్చిన రాజమహేంద్రవర స్త్రీ పునర్వివాహ చరిత్రమునుగూర్చిన యుపన్యాసములో నిట్లుచెప్పితిని : -

"వారిలో నాకు మొదటినుండియు పరమాప్తుఁడయి, ఒక్క యీ కార్యమునందు మాత్రమేకాక దేశక్షేమము నిమిత్తమయి నేను చేయతలపెట్టిన మంచికార్యములలో నెల్లను నాకు కుడిభుజమయియుండి, పయికి పేరు నాదియైనను చాటున నాకంటెను బహుగుణములధికముగా పనిచేయుచు వచ్చు చున్న బసవరాజు గవర్రాజుగారి సాహస చరిత్రము నిచ్చట ముఖ్య