పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

151



యభేదము కలిగినది. ఆస్తికపాఠశాలయని పేరు పెట్టినప్పుడు సొమ్మునిమిత్తము చూడక ప్రథమోద్దేశానుసారముగా దానిలో మొదటినుండియు పరిశుద్ధాస్తిక మతసిద్ధాంతములను బాలురకు నేర్పవలయునని నాయభిప్రాయము. మొదట నే యట్టిపనికిఁ బూనినయెడల పాఠశాలకు బాలురంతగా రారుగనుక పాఠశాల బలపడిన తరువాత క్రమక్రమముగా పరిశుద్ధాస్తిక మతసిద్ధాంతముల నందుఁ జొప్పింపవలయు నని లక్ష్మీనరసింహముగారి యభిప్రాయము. కొందఱు నాయభిప్రాయముతోను కొందఱాయన యభిప్రాయముతోను నేకీభవించిరి. ఆపాఠశాలాభవనములోనే విద్యార్థులకును తదితరులకును నుపయోగపడుట కయి యాస్తికమతపుస్తకములను జదివి బోధించుటకయి యొకతరగతి పెట్టఁబడినది. మా వితంతూద్వాహసమాజమును ప్రార్థనాసమాజమును ప్రబలు చుండుట చూచి పూర్వాచారపరాయణులయిన బాలికాపాఠశాలకార్య నిర్వాహకులు మాసభలకు బాలికాపాఠశాలామందిరము నియ్యక పోవుటచేత ప్రార్థనాసమాజము నాయాస్తికపాఠశాలలోనే పెట్టితిమి. 1881 వ సంవత్సరము మార్చి నెలలో పండిత శివనాథశాస్త్రిగారు రాజమహేంద్రవరమునకు వచ్చి హృదయోత్తేజకము లయిన యుపన్యాసముల నిచ్చిపోయిరి. ఆయుపన్యాసములవలన నింగ్లీషు చదువుకొన్న వారిలోను విద్యార్థులలోను సత్కార్యోత్సాహము హెచ్చినది. విద్యార్థులు తమలోఁ దాము ప్రత్యేకముగా ప్రార్థనాసమాజముల నేర్పఱుచుకొని యేకేశ్వరారాధనము చేయసాగిరి. విద్యార్థులు బీదల యుపయోగమునిమిత్తమయి రాత్రిపాఠశాలలను స్థాపించి వంతులు వేసికొని రాత్రులుపోయి పనివాండ్రకు పాఠములుచెప్పుచు వచ్చిరి. ఈపాఠశాలలవిషయమయి రబ్బాప్రగడ పాపయ్యగారు, తాయి సూర్యప్రకాశరావుగారు, పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు మొదలయిన విద్యార్థు లనేకులు మహోత్సాహముతో పని చేయుచుండిరి. రాత్రిపాఠశాల విషయమయి విద్యార్థులకును మఱికొందఱు పెద్దమనుష్యులకును కొన్ని తగవులువచ్చి విద్యార్థులు తాము క్రొత్తగా వేఱొకపాఠశాలను స్థాపింపవలసివచ్చి నను, తుదకు