పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

స్వీయ చరిత్రము.

సముతోనే సాధ్యాసాధ్యవిచారమును తలపెట్టక నే నీపనిలోఁ బ్రవేశించితిని. తనకు ధర్మమయినపనిలో శక్తివంచన లేక కృషిచేయుట యొక్కటి యే మనుష్యుని పని ; దాని ఫలాఫలముల నియ్యవలసినవాఁ డీశ్వరుఁడుగాన తద్విచారము మనుష్యునిది కాదు. ఈశ్వర ప్రీతికరమయిన సత్కార్యమునందు యధాశక్తిని గృషిచేసినను ఫలము గలుగకపోయిన పక్షమున మనుష్యుని లోప మేదియులేదు. మనుష్యుఁడు చేయవలసినపనిని జేసిన వాఁడగుటచేత నంతవఱకే యతఁడు శ్లాఘార్హుఁడు. నాయాహ్వానపత్రిక వెలువడఁగానే మా పట్టణములోని వైదికవృత్తిలో నున్న పండితులందఱును నామీఁద ధ్వజమెత్తి కత్తులు నూఱుట కారంభించిరి ; పూర్వాచార పరాయణులయిన లౌకికశిఖామణులును వైదికోత్తములును వారికి సహాయులయి నామీఁద దాడివెడలిరి. అప్పుడు విధవావివాహ మన్న శబ్దమే కర్ణకఠోరమై దుస్సహమై యెల్లవారికిని హృదయశూలముగా నుండెను. అప్పుడు నాకు స్త్రీ పునర్వివాహవిషయమయి యేమేమి గ్రంథము లున్నవో తెలియవు. ఈశ్వరచంద్ర విద్యాసాగరులవారి గ్రంథమున్నట్టు తెలియును గాని నా కప్పు డది లభించినది కాదు. మనుస్మృతియు, యాజ్ఞవల్క్యస్మృతియు, పరాశరస్మృతియుమాత్రము నాయొద్దనున్నవి. ఈవిషయమయి తత్త్వబోధినిలోఁ బ్రకటింపఁబడిన యుపన్యాస మొకటియు, పురుషార్థప్రదాయినిలోఁ బ్రకటింపఁ బడిన యుపన్యాస మొకటియు,నాకు లభ్యములయినవి. ఈగ్రంధసాహాయ్యముతో నాబుద్ధికిఁ దోచినయుక్తులను శాస్త్రప్రమాణములను గూర్చి, యుపన్యాసము నిమిత్త మేర్పఱుపఁబడిన దినము నాఁటికి నాశక్తికొలఁది నొక యుపన్యాసము వ్రాసి, శ్రీవిజయనగరపు మహారాజుగారి బాలికాపాఠశాలామందిరమున జరగిన మహాసభలో 1879 వ సంవత్సరము ఆగష్టు నెల 3 వ తేదిని మొట్ట మొదటఁ జదివితిని. బాలవితంతువుల దురవస్థనుగూర్చి జాలిపుట్టునట్టుగా వ్రాయఁబడిన, నాయుపన్యాసభాగము బహుజనుల మనస్సులను కరఁగింప గలిగినను, చిరకాలాచారబలముచేత శిలాకఠినహృదయులైన పండితులకోపాగ్ని కది యా