పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

125

బయపునేడి వేంకటజొగయ్యగారును, కన్నమురెడ్డి పార్థసారథి నాయఁడు గారును, సమాజముగాఁ జేరితిమి. సమాజము పేరు విని పెద్దమనుష్యులు సహితము పరిహసించువా రగుటచేత మేము ప్రతివారమును ప్రాతఃకాలమున మా మేడపైని తలుపులు వేసికొని కూరుచుండియే ప్రార్థనలు చేసికొనుచుండెడి వారము. అప్పుడు పార్థసారథి నాయఁడుగారు కీర్తనలుపాడుచుండెడివారు; నేను చిన్న ధర్మోపదేశము వ్రాసి చదివెడివాఁడను. నేనప్పుడు చేసిన ధర్మోపదేశములు 1879 వ సంవత్సరపు వివేకవర్ధనిలోఁ బ్రకటింపఁబడినవి. కొన్ని నెలలైనతరువాత మామిత్రులను గొందఱను ప్రార్థనా సమయములయందు రానిచ్చెడువారము. సంవత్సర మైనతరువాత సమాజమును బహిరంగముగా విజయనగరము మహారాజుగారి బాలికాపాఠశాలకుఁ గొనిపోయితిమి. ఇప్పుడీప్రార్థనసమాజమునకు స్వకీయమైనమందిరమే యేర్పడియున్నది ఈప్రార్థనాసమాజ మెన్నియో సత్కార్యములకును, ఎందఱివర్తనమునో చక్కఁబఱుచుటకును, కారణమైనదని నిస్సందేహముగాఁ జెప్పవచ్చును. దీనివలన బాగుపడినవారిలో నొక్కరి నిందుఁ బేర్కొనెదను. మాపట్టణమున నండూరి జగ్గరాజుగారని నియోగిబ్రాహ్మణుఁ డొకఁ డుండెడివాఁడు. ఆయనకు విధవలతో సంబంధ ముండెననియు, తన్మూలమున ధనార్జనము చేయుచుండెననియు, చెడ్డపే రుండెను. ఆయన యొకనాఁ డొకమిత్రునితోఁగూడి ప్రార్థనసమాజమునకు వచ్చి మాప్రార్థనలను ధర్మోపన్యాసమును విని నాటినుండి క్రమముగా ప్రార్థనలకు వచ్చుచుండెను ; తన వెనుకటి దుర్వర్తనమును విడిచి సన్మార్గము నవలంబించెను. అది చూచి విగ్రహారాధకు లాతనితల్లియొద్దకు బోయి దుస్సహవాసముచేత సమాజమునకుఁబోయి నీకొడుకు చెడిపోవుచున్నాఁడని చెప్పిరి. సమాజమునకుఁ బోవలదని తల్లి యతనికి బుద్ధిచెప్పఁ జొచ్చెను. అతఁ డొకనాఁడు తనతల్లిని రహస్యముగా బాలికాపాఠశాలకుఁ గొనివచ్చి నేను ధర్మోపదేశము చేయుస్థానమునకు వెనుక తలుపుచాటునఁ గూర్చుండఁబెట్టెను. ఆమె నాటి యుపాసనమునుజూచి యానందించి ప్రతివారమును తన్నక్కడకుఁ గొనిపొ