పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

స్వీయ చరిత్రము.

న్యాయాధిపతియునయిన వాలేసుదొరగా రీవ్యవహారములో సాక్షియయి యుండినందున చెన్నపురి యున్నతన్యాయసభవారు విచారణనిమిత్త మీవ్యవహారమును కృష్ణామండలదండాధికారికార్యస్థానమునకుఁ బంపిరి. అక్టోబరు నెలలో నక్కడ విచారణజరగెను. ఈమూడుమాసములును మాసిరస్తాదారు గారు కారాగృహమునందే యుండవలసినవా రయిరి. మాసిరస్తాదారుగారిస్థితి మిక్కిలి శోచనీయమైనదిగా నుండెను. ఆయన యీవ్యవహారములోఁ బొందినలాభ మత్యల్పము. ఆయన కెనమండుగురో తొమ్మండుగురో బిడ్డలు. ఏనెలజీతమా నెలలోనే యన్న పానములక్రింద వ్యయపడుచుండుటచేత నింట పదిదినములగ్రాసమున కైననునిలువలేదు. ఆయనస్థితిని విచారించినచో విచారణచేసిన మండలదండాధికారిగారికిని ప్రతిపక్షులమై యున్న మాకునుగూడ పరితాపకరముగా నుండెను. విచారణ జరిగినమీఁదట కృష్ణామండలదండాధికారిగా రగు కెల్సాలుదొరగారు సరియైనముక్కలు మండలన్యాయసభలో నర్పింపఁబడినందుకు లేశమైనను సందేహము లేదనియు, ఆముక్కలుపోయి వానిస్థానమున వేఱుముక్కలు వచ్చుట నిశ్చయమేయైనను సిరస్తాదారే వాని నపహరించినట్టు సాక్ష్యములేనందున నతఁడు నిర్దోషియనియు, వ్రాసి రొజారియోదొరగారిని విడుదల చేసిరి.

ఈలోపల మావివేకవర్ధనిలో వ్రాయఁబడినయంశమును జూచి చెన్నపురి దొరతనమువా రున్నతన్యాయసభవారికి వ్రాయఁగా, వారు విమర్శ చేసి పర్యవసానము తమకుఁ దెలుపవలసినదని మామండలన్యాయాధిపతిగారి కుత్తరు విచ్చిరి. అప్పుడు మండల న్యాయాధిపతిగారు మేలుకొని నన్నును మఱి కొందఱిని పిలిపించి విమర్శ కారంభించిరి. విచారణారంభదినమున మాప్రతిపక్షులైన చిత్రపు కామరాజుగారు మొదలగువారు మహోల్లాసముతో సభకు వచ్చి నవ్వు మొగములతో సావజ్ఞముగా నావంకసారెసారెకుఁ జూచుచు నా కెదురుగా కుర్చీల నలంకరించి కూరుచుండిరి. ఈవిచారణలో నేను తప్పక కారాగృహమునకుఁ బంపఁబడుదునని వారికిమాత్రమేకాక యెల్ల వారికిని గట్టి