పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

స్వీయ చరిత్రము.

పత్రిక ప్రకటింపఁబడు ననఁగా గతసాయంకాలమున నే నాన్యాయవాదుల కడకు వారిమిత్రునినొక్కనిని లేఖనిమిత్తము పంపితిని. వారులేఖను మఱుసటి దినమునఁ బంపెదమని నాకు బదులు పంపి, తా మీవ్యవహారములోఁ దగులుకొనఁగూడదనియు పత్రికావిలేఖకులు తగులుకొని చిక్కులు పడుచుండఁగాఁ దాము పయినుండి వేడుక చూడవచ్చుననియు తమలోఁ దామోలోచించు కొనిరఁట. ఆవార్తతెచ్చినయతఁడు మాటలధోరణిని వారిరహస్యమును నాకడ వెలిఁబుచ్చెను. జరగినమోసమునకు నేనాశ్చర్యవిషాదముల నొందియు నణుమాత్రమును నిరుత్సాహుఁడను గాక మనోవికారమేమియు ముఖచిహ్నములవలనఁ గానరానీక శాంతభావముతో, వారు వేఱుగ వ్రాసియియ్యవలసినయా వశ్యకమే లేదనియు, పెద్దమనుష్యుల యెదుటఁ జెప్పియుండుటచేత నాకాసంగతులను దెలిపినవారిపేరులుకూడ పత్రికలోవేసి ప్రకటించెదననియు, ఆతనితోఁ జెప్పి నట్టుగాఁజెప్పితిని. ఆతఁడప్పుడే నాయొద్దనుండి పోయి తనకాప్తుఁడయినయొక న్యాయవాదితో నే నన్నమాటలు చెప్పెను. ఆతఁడుతమ పేరులు వెల్లడియగునని భయపడి తక్కిన న్యాయవాదులకడ కాలోచనకుఁ బోయెను. రాత్రి భోజనములయినతరువాత వారు స్వగృహములయందు దొరకరు. వారి నప్పుడు సందర్శింపవలె నన్న పక్షమున వేశ్యాగృహములలోనె వెదకవలెను. తాము వేశ్యలయిండ్లనుండి శృంగారవేషములతో వచ్చుచుండగా నాకంటఁబడుట నాకవమానకరమని యెంచి, పగలు పదిగంటలకు నేను పాఠశాలకు నడచిపోవు చుండునప్పుడు నారాక వేచియుండి పాఁచిముఖములతో తాంబూలములు నమలుచు బోగముదానియింటినుండి రావలె నని పూర్వము నా కెదురుపడు చుండినమహానుభావులును వారిలోనొకరిద్దఱుండిరి. నాఁటిరాత్రివారెట్లో నిశాసమయమున కందఱునొక్కచోట సమావేశమయిరి. నడిరేయి రెండుజాముల వేళనెవ్వరో మావీధితలుపులు గుద్దుచున్నట్టును నన్ను గట్టిగాఁ బిలుచుచున్నట్టును సందడివినఁబడఁగా, నేను గాఢనిద్రలో నులికిపడి లేచి మేడదిగి వచ్చి తలుపు తీయునప్పటికి మాన్యాయవాదు లందఱును నాకుఁబ్రత్యక్షమైరి. వారు