పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

103

ను పేరుకొనుటయే వారివాదమునకుఁ జాలియుండెను. న్యాయాధిపతిగారు వారుదాహరించినప్రకరణబలమును రహస్యమున విచారించి తాముతృప్తిపొందిన పిమ్మట వ్యవహారము నేదో యొకపక్షమున తీర్చుచుండిరి. ఆనూతనశాసనములో దశసంఖ్యలును తద్గుణితసంఖ్యలును గలప్రకరణములే కాని వానినడిమి యంకెలు గలప్రకరణములేవియు లేవు. వాదిపక్షమున వచ్చినన్యాయవాది "ఏలినవారు 100 వ ప్రకరణమును చిత్తగించి న్యాయము దయచేయింప వలెను" అని వేఁడఁగా, ప్రతివాదిపక్షమున వచ్చినన్యాయవాది "ఆప్రకరణము పనికిరాదు. ఏలినవారు 150 వ ప్రకరణమును చిత్తగించి న్యాయము దయచేయింప వలెను." అని మనవి చేసికొనును. ఆపయి నొకరితరువాత నొకరుగా 160, 170, 180, 190, 200 అని యుభయపక్షముల న్యాయవాదులును నూతన న్యాయశాసనముయొక్క ప్రకరణముల నుదాహరించుచు రాఁగాఁ గడపట నెక్కడనో యొక సంఖ్యకడ పాట నాటికి నిలిచిపోవును. "మంచిది. ఆలోచించెదము. అప్రకరణార్థము నీరాత్రి సావధానముగా చిత్తగించి రేపు సభలో తీర్పుచెప్పెదము" అని చెప్పియాప్రకరణసంఖ్యను వ్రాసికొని యా గ్రంథమునప్పటి కంతటితో ముగించి, మునసబుగారు మఱియొకగ్రంథనకు దిగి యీప్రకారముగా దినమున కెన్ని యోవ్యవహారములను విచారించి తీర్చు చుండిరి. పెద్దప్రకరణమును జూపి యెక్కువపాట పాడినన్యాయవాది యా రాత్రి యాన్యాయపరిపాలకునియింటికిఁ బోయి యాప్రకరణార్థమును కన్నులకుఁ గట్టినట్టుగా దీపము వెలుతురున విశదముగాఁ జూపినపక్షమున మఱునాఁ డాపక్షమునమునసబుగారు న్యాయసభలో తీర్పువినిపించు చుందురు. నూఱవప్రకరణమనఁగా నూఱురూపాయలనియు, నూటయేఁబదవ ప్రకరణమనఁగానూట యేఁబదిరూపాయలనియు, ఆనూతనశాసనము యొక్కపారిభాషికప్రకరణము లన్నియు వాగ్రూపములుగాక ధనరూపము లయినవని నాకు వివరింపవలసిన శ్రమ యియ్యకయీవఱకే బుద్ధిమంతులయిన మాచదువరులు తమంతనే గ్రహించి యుందురు. ఇట్లధికారులకు లంచములిచ్చి తాములాభము పొందుచుండుట