పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

93

ప్రకారమే జరిగించవలసినదనియు, అట్టివారిలో నెవ్వరైనఁ బశ్చాత్తప్తులయి మరల నీసమాజములోఁ జేర నిచ్ఛించినయెడల సామాజికులలోఁ బదిమందికి తక్కువ కాకుండఁ జేరినసభలో క్షమార్పణము చెప్పుకొనుదు రేని మొదటి పర్యాయము సమాజములో మరలఁ జేర్చుకోఁబడవచ్చుననియు నిబంధనలను వ్రాసికొని దానిక్రిందఁ దమచేవ్రాళ్లను జేసి, ఈపద్ధతులను గ్రమమగా నడిపించువిషయమైన శ్రద్ధను పుచ్చుకొనుటకును ఆయాసమయములయందు విశేష సభలు కూడవలసినయెడల సభికులకుయుక్తకాలమునఁ దెలిపి వారిని రప్పించుటకును, ఈ పత్రికాధిపతినే కార్యదర్శిఁగా నియమించిరి."

మనవారిలో ననేకులు వాగ్దానము నెంతశీఘ్రముగాఁ జేయుదురో యంతశీఘ్రముగానే దాని నతిక్రమింతురు. వసూళ్లవిషయమున మే మొడంబడిక చేసికొన్న కొన్ని దినములలోనే మాయూర నొక గొప్పగృహస్థుని యింట నుపనయనమహోత్సవము నడచినది. మాసమాఖ్యలో సంతకము చేసిన వారే యొక రాయుత్సవమునకుఁ బోయి యచ్చట బోగముమేళమునకు వసూలు చదివించి వచ్చిరి. నా కాసంగతి మాపాఠశాలలోని విద్యార్థులవలనఁ దెలిసినది. నేను సాయంకాల మైదుగంటల కింటికి రాఁగానే యాగృహస్థునకు నేను విన్న వార్తను దెలుపుచు, నేను విన్నదే నిజమైనయెడల మనయొడంబడికలోని దండననిబంధనలను ప్రవృత్తికిఁ దీసికొని రావలసియుండునని వ్రాసిపంపి సాయంతనవిహారమునకుఁ బోయితిని. మాకట్టుపాటును మీఱినయతఁడు దైవికముగా నగరపారిశుద్ధ్యవిచారణసంఘసభ్యులలో నొకరగు బెజగము సోమయ్యగారును పెద్దకోమటి యగుట తటస్థించినందున, నాప్రకటనపత్రికవలనఁ గలుగవలసినసత్ఫలము తోడనే కలిగినది. నాపత్రికను జూడఁగానే యతఁడు భయపడి, నేను రాత్రి యేడుగంటల కింటికి మరల వచ్చునప్పటికి మావీధియరుగుమీఁదఁ గూరుచుండియుండెను. నన్నుఁ జూడఁగానే యతఁ డరుఁగు దిగి నిలుచుండి దండము పెట్టి, తా నొడంబడికను బుద్ధిపూర్వకముగా నతిక్రమింపలేదనియు, అందలి నిబంధన లెప్పటినుండి వ్యవహారములోనికి