పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానమనునది కేవల గ్రంథపఠనమువలనను, ధ్యానమువలనను రాదు. సత్యమైన జిజ్ఞాసయే జ్ఞానము. ప్రయోజనకారి యగునట్లు సరియైన తత్త్వవిచారము పొందకోరిన యెడల నింద్రియములను, మనస్సును, కర్మములను నడచి, వశపరుచు కొనవలెను. ఇట్లడపనియెడల పొందిన జ్ఞానము లోపల జొచ్చి, యాత్మకు సహాయపడదు. నూనెమీద నీరు విడిచిన మాదిరిగ ఫలకారికాకుండబోవును. సత్యమయిన జ్ఞానమును బొందక, కర్మములను మనస్సును నడచి వశపరుచుకొనక, స్వభావగుణములను యధేచ్ఛముగ తమ పనులను చేయవిడచినయెడల కర్మభారము వృద్ధి యగుచునే పోవును.


(21)

అందరకును మోక్షము.

(గీత : అధ్యాయములు 4, 7, 9)


మహాపాపము చేసినవాడయినను, 'నాకేదిగతి?'యని యెవడును నిరాశను పడనక్కరలేదు. వానికిగూడ తాచేసిన పాపమునుగూర్చి దుఃఖపడి భగవంతుని శరణుజొచ్చినయెడల విడుదలయున్నది. ఇది గీతలోని ధృఢమైన బోధన.