పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(1)

భారతకథ, గీత.

భగవద్గీత మహాభారతములో నొకభాగము. యుద్ధమారంభింపబోవు సమయమున నిరుపక్షములందును పోరికి సన్నద్ధులై నిలిచిన సేనలను చూతమని, తన రధమును సేనల మధ్యకు కొనిపొమ్మని యర్జునుడు సారథియైన శ్రీకృష్ణునితో చెప్పెను. అప్పుడు బంధువులును, స్నేహితులును నొకరినొకరు చంప నాయుధపాణులై నిలుచుటజూచి యతడు మనసున కలగి “ఇదేమిపని? రాజ్య మేల? పగ యేల? చుట్టములను చంపి సంపాదించు రాజ్యాధికారభోగమువలన నేమిసుఖము?” అని పలికి, వింటిని క్రిందికి విడిచి. చదికిలబడి కూర్చుండెను. ఈసందర్భమున నతనికి సారథియై యుండిన కృష్ణభగవానుడు గురువై నిలిచి యుపదేశించిన మాటలే భగవద్గీత‌ యనునది.

ఇట్లర్జునుడు, "యుద్ధమెందుకు? నేను యుద్ధము చేయను” అని చెప్పినప్పుడు “యుద్ధముచేయుటయే నీవిధి" అని యుపదేశము చేయుచు వివరించిన యీ మార్గమునెల్ల హిందువులును సంప్రదాయవ్యత్యాసము లేక వేదమువలెను, ఉపనిషత్తుల వలెను, నొప్పుకొను నొకశాస్త్రమై యనేక సహస్రవర్షములనుండియు నంగీకరింపబడి వచ్చుచున్నది.