పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనకుడు మొదలగువారు కర్మము నాచరించియే సిద్ధిని పొందిరి. లోకవ్యవహారము చక్కగా జరుగుటకైనను నీవు నీకర్మము నాచరించుటయే తగినమార్గము. 3-20


యద్య దాచరతి శ్రేష్ఠ స్త త్త దేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోక స్త దనువర్తతే.


దేనిని శ్రేష్ఠుడైనవాడు చేయునో దానినే తక్కిన జనులు ననుసరించి చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగ చేయునో దానినే లోకులనుసరింతురు. 3-21


సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత
కుర్యా ద్విద్వాంస్తథా౽సక్తశ్చికీర్షు ర్లోక సంగ్రహం.


మూఢులు ఫలము నాసించి యెట్లు సంగముతో పనిని చేయుదురో, అట్లే జ్ఞానియు నిస్సంగియై లోకపు మేలు తలంచి తన పనిని గూడ నుత్సాహముతో జేయవలెను. 3-25


న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినాం
జోషయే త్సర్వకర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్.


ఆశతోగూడి పనిచేయు అజ్ఞానులకు జ్ఞానియైన వాడు బుద్ధిభేదమును కలిగింపకూడదు. తాను యోగమార్గమున నిలిచి పనిచేయుచు నితరులు గూడ నెల్ల పనులందును ఆసక్తితోచేయునట్లు నడువ వలెను. 3-26