పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు


ఒకభాషనుండి మరియొక భాషలోనికి అనువదించుట కష్టమైనపని. తమిళమునకును తెనుగునకును దగ్గరయేయైనను నీరెంటికిని పలుకుబడిలో ఎన్నో భేదములున్నవి. తెనుగునకు సంస్కృతపదముల సాహయ్య మెక్కువగా కావలెను. తమిళమునకంతగా నక్కరలేదు. తమిళములో నొక యభిప్రా యమును చాలమాటలతో కొంచెము దీర్ఘముగా చెప్పవ లెను. తమిళపదములకు సరియైన అచ్చ తెనుగుపదములు సాధారణముగా నుండుచునేయున్నను, వానిలో కొన్ని వ్యవహారభ్రష్టములై సర్వజనసుబోధకములు కాకపోవచ్చును. అప్పుడనువాదకుడు తెనుగు వ్యవహారమునగల వేరుపదము లనే యుపయోగింపవలసియుండును.


ఒక గ్రంథమును స్వతంత్రముగ రచించుట సులభము. మరియొకభాషనుండి యనువదింపవలసివచ్చినప్పు డనువాదకుడు రెండువిధములయిన భయములకు లోనగును. మొదటిది మూల గ్రంథకర్త యభిప్రాయమునకు భంగము కలుగు నేమోయను భయము. రెండవది మూలమునున్న దున్నట్లుగా, ముక్కకుముక్కగా భాషాంతరీకరించినయెడల అనువాదితగ్రంథమంత సుబోధకముకాదేమో యనుభయము.