పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విభూతిని చేకూర్చు శక్తి దానికి గలదు. నాకు తెలిసినంత మట్టుకు ప్రపంచవాఙ్మయములో నెక్కడను హిందువులకే కాక సమస్తమానవులకును ధర్మభాండాగారమై యుత్తమ స్థానము నధిష్టింపగల గ్రంథము గీతతప్ప మరియొకటి కాన రాదు. వివిధదేశముల విద్వాంసు లీగ్రంథమును పఠించి బ్రహ్మమునుగూర్చిన నిర్మల సంపూర్ణజ్ఞానమును పొంది, నిష్కలుషము, నిష్కామము, శ్రేష్ఠమునైన భగవద్భక్తిని సంపాదించినారు. ప్రపంచము నావరించియున్న యజ్ఞానాంధ కారమునుండి బయటికి దారిచూపుచు, అక్షయమైన ప్రేమ తైలాధారమున వెలుగుచున్న యీ చిన్నద్వీపము సహాయమును బొందుచున్న పురుషులును స్త్రీలును మిక్కిలి యదృష్టవంతులు. అంధకారమున దేవులాడుచున్న మానవ జాతికంతటికి నాదీపము సహాయమునుజూపుట యట్టివారికి కర్తవ్యముగా నున్నది.


ధనికుని హర్మ్యమునుండి, పేదవాని గుడిసెవరకు అన్ని హిందూగృహములలోను గీతాగ్రంథపు ప్రతియొకటియుండి, భగవదవతారమునకు చూపవలసిన భక్తితో జనులందరును దాని నారాధించుచుండుటను నా యాయుష్కాలములో చూడగల భాగ్యము నాకు ప్రసాదింపవలెనని యీశ్వరుని హృదయపూర్వకముగ ప్రార్థించుచున్నాను. జ్ఞానముతోను, భక్తితోను, నీదేశముననేకాక ప్రపంచమందంతటను నన్ని