పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాక్షేపణ కెడమిచ్చును. ఏయుత్తమ మతమునం దైనను, యేధర్మగ్రంథమున చెప్పబడిన జీవనక్రమమైనను లోపము లేక పూర్తిగ ననుసరించుట కందరికిని సాధ్యము కాదు. ఉదాహరణమునకు, ఏసుక్రీస్తునుపదేశములను తీసుకొందము. అతడు నడచి చూపినదారియు, చేసినయుపదేశములును సంపూర్ణముగనాచరణములోనికితెచ్చుటయెల్లరకుసాధ్యమగునా? కాని, వారిమార్గమునుబట్టి పోవువారికి దానివలన ప్రయోజనములేదా? ఎందరో జనులనదికాపాడి ఉద్ధరించినది. మహాత్ములకుమాత్రమేకాదు, పామరులకుకూడ, దేహమున కాహారము యెట్లో యట్లే యంతరాత్మకుగల యాకలిని తృప్తినొందించు నాహారమై, యాయుపదేశ ముపయోగపడుచు వచ్చినది. అట్లే యెల్లమార్గములును. అట్లే గీతయును.

చేతితో దీపమును బట్టుకొనిపోవునప్పుడు మననీడయే దారి కడ్డమువచ్చును. చెట్టును, పొదయు, వెలుగున కడ్డు పెట్టును. కాని ఇది వెలుగుదోషము కాదు. దీప ముపయో గింపకయు పోలేదు. పాపము, కష్టము, సందేహము, ఆశ, మనోద్వేగము ఇవి యడ్డముగ వచ్చినను, గీతయం దుపదేశింపబడిన లక్ష్యములను ముందుంచుకొని, మనము నడచిన యెడల చీకటినిదాటి కృతార్థులము కావచ్చును. ఒక్కొక్కడు నంతటిని చేయసాధ్యము కాకున్నను, అందరు నొక్కటే