పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50


వ. అంతం గొన్ని దినంబులకు నభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుండు దశమాన పరిచ్ఛేద్యుండై,గర్భాంతరాళంబున దురంతంబైస యశ్వత్థామ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు. (1-277)


ఉ. కుయ్యిడ శక్తిలే దుదర గోళములోపల నున్న వాఁద ది

క్కెయ్యది? దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నేఁ

డియ్యిషువహ్ని వాయుట్కు నెయ్యది మార్గము? నన్నుఁ గావ నే

యయ్య గలండు? గర్భ జనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా! (1-278)


క. చిచ్చఱకోల వశంబునఁ, జచ్చిన బహిర్గతుడుఁ గాని సమయమునను దా

నుచ్చలిత గర్భవేదనఁ, జచ్చును మాతల్లి ఘెర సంతాపమున్. (1-279)


క. చెచ్చెర బాణ జ్వాలలు, వచ్చిన విష్ణండు గావవచ్చు ననుచుఁ దా

ముచ్చటలు సెప్పు సతులకు, నిచ్చలు మాయవ్వ నేఁడు నిజమయ్యెడినో! (1-280)


శా. రాఁడా చూడు? సమస్త భూతములులో రాజిల్లువాఁ డిచ్చటన్

లేడా? పాఱుని చ్చిచ్చఱమ్ము దిలగన్ లీలాగతిన్ ద్రోచి నా

కీడా? నేఁ డభయప్రదాన మతఁ దూహింపన్ నతత్రాత మున్

గాఁడా? యెందఱిఁ గావఁడీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో! (1-281)


వ. అని గతాగత పాణుండై శిశువు చింతించు సమయంబున. (1-282)


సీ. మేఘంబు మీఁద క్రొమ్మెఱుఁగు కైవడి మేనిపై నున్న పచ్చని పటమువాఁడు

గండ భాగంబులఁ గాంచన మణినయ మకరకుండల కాంతి మలయువాఁడు

శరవహ్ని నణఁగించు సంరంభమునఁ జేసి కన్నుల నునుఁగేంపు గలుగువాఁడు

బాలార్క మండల ప్రతిమాన రత్న హాటక విరాజిత కిరీటంబువాఁడు

తే. గంకణాంగద వనమాలి విరాజి, మానుఁ డసమానుఁ డంగుష్టమాత్రదేహుఁ

డొక్కగదఁ జేతఁదాల్చి నేత్రోత్సవమగు, విష్ణుఁ డావిర్భవించె న వ్వేళయందు. (1-283)


వ. ఇట్లు భక్తపరాధీనుండైన పరమేశ్వరుం డావిర్భవించి, మంచు విరియించు మార్తాండు చందంబున శిశుకునకు దశదిశలం యఖండిత మహోల్కాజాల సన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ జిఱజిఱం ద్రిప్పి, విప్రుని చిచ్చరమ్ము వేఁడిమి పోఁడిమిఁ జెఱిచి, డింభకుని పరితాప విజృంభణంబు నివారించి, గర్భంబు కందకుండ రక్షించి యర్భకునికి నానందంబు గల్పించిన. (1-284)